‘మాది ఉమ్మడి కుటుంబం. మా సోదరుడు టీడీపీలో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదు. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను. ప్రస్తుతం ఇళ్లు కట్టుకుంటున్నాం. సోదరుడి నిర్ణయాలు ఆయన వ్యక్తిగతం. నా నిర్ణయాలపై ఎవరి ప్రభావం లేదు. బీజేపీ అధిష్టానం నిర్ణయమే, తన నిర్ణయమని స్పష్టం చేశారు’ కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు ఆయన. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర నేతలు ముందుకు తీసుకెళ్తామన్నారు. బీజేపీ కార్యకర్తలా పార్టీ బలోపేతం కోసం పాటుపడతానన్నారు. ఏపీ విభజన జరగక ముందే ప్రత్యేక హోదా అనే దానిపై కమిటీలు వేశారు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. 


ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో డెవలప్ మెంట్ జరుగుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను కేవలం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం ఆశించి మాత్రమే పార్టీలో చేరానని, పదవులు ఆశించి కాదన్నారు.  బీజేపీ నుంచి ఓ ముఖ్య నేత తనను సంప్రదించారని, ఆ తర్వాత బీజేపీలో చేరానని తెలిపారు. రూ.3,500 కోట్లు పెట్టుబడి పెడతారో వాళ్లు మేం చేసిన ఇనుము కొనుక్కోండి అని మాత్రమే చెప్పారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మడం లేదన్నారు. నష్టం వచ్చే ఏ విషయాన్నైనా మార్చేందుకు చూస్తారని, ఎయిరిండియాను కేంద్రం ఎందుకు అమ్మింది, విపరీతమైన నష్టం రావడమే కారణం అన్నారు. 


ఎయిరిండియా తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సెంటిమెంట్ ఉంది కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. కానీ లాభాల్లోకి రావాలి. బిడ్డింగ్ వేస్తే ఎవరైనా ఆసక్తి చూపిస్తారని చెప్పారు. ఇంకో విషయం ఉందని, కానీ అది తెలంగాణకు సంబంధించిన అంశమన్నారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి, అక్కడే పెరిగి, హెచ్‌పీఎస్, నిజాం కాలేజీల్లో చదువుకున్నానని, సొంత ఊరు ఏపీలోని చిత్తూరు అన్నారు. తనకు బెంగళూరులో కూడా ఇల్లు ఉందని అన్నారు. అలాంటప్పుడు పార్టీ అవసరాన్ని బట్టి, ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. మొదట తాను భారతీయుడినని, తరువాతే ఏపీ, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వాడినన్నారు. పార్టీ ఎక్కడ పనిచేయమంటే అక్కడ బరిలోకి దిగుతాను. ఏ పదవి ఆశించి బీజేపీలో చేరారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఆశించి పార్టీలో చేరానన్నారు. పార్టీ తనకు అప్పగించే బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తాను. పనులు చేస్తూ పోతే పదవులు అవే వస్తాయన్నారు కిరణ్ కుమార్ రెడ్డి.