ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్యల సంగతి ఇటీవల బాగా హైలెట్ అవుతోంది. అయితే భార్య విషయంలో ఆమె ప్రియుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఓ భర్త కథ ఇది. నెల్లూరు నగరానికి కూతవేటు సమీపంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. 15సార్లు కత్తితో పొడిచి అతి కిరాతకంగా భార్య ప్రియుడిని హత్య చేశాడు భర్త. 


నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెంలో ఈ దారుణం జరిగింది. నెల్లూరు నగరంలోని బాలాజీనగర్‌ ప్రాంతంలో ఉంటున్న దాసి సునీల్‌(30) అలియాస్ ఆలీభాయ్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆలీ భాయ్ బైక్ షోరూమ్ లో పనిచేస్తుండేవాడు. భార్య పిల్లలతో ఉన్న ఆలీభాయ్ కొంతకాలంగా ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమె కూడా వివాహితే. భర్తతో కలసి ఆ వివాహిత చింతారెడ్డిపాలెం సమీపంలోని మిట్టపాలెంలో నివశిస్తుండేది. తరచుగా ఆలీభాయ్ ఆ మహిళ కోసం మిట్టపాలెం వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆమె భర్త రాజాకి ఆ విషయం తెలిసింది. దీంతో అతను ఆలీభాయ్ ని హెచ్చరించాడు. తన భార్య జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 


అప్పటినుంచి.. 
ఆలీ భాయ్ కి రాజా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అతని ప్రవర్తనలో మరింత మార్పు వచ్చింది. గతంలో కంటే ఎక్కువగా అతను మిట్టపాలెంకు వస్తుండేవాడు. రాజా ఇంటి ముందే తచ్చాడుతుండేవాడు. పరువు కోసం ఆలీ భాయ్ కి పర్సనల్ గా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టిన రాజా.. ఇది చూసి తట్టుకోలేకపోయేవాడు. రాజాని రెచ్చగొట్టేలా ఆలీభాయ్ ప్రవర్తించేవాడని తెలుస్తోంది. అక్కడే ఉంటూ, స్నేహితులతో కలసి తాగుతూ, తిరుగుతూ ఉండేవాడు. దీన్ని చూడలేని రాజా ఓ పథకం పన్నాడు. చివరకు ఆలీభాయ్ ని అంతమొందించాడు. 


గురువారం అర్ధరాత్రి సునీల్‌ అలియాస్ ఆలీ భాయ్ తన స్నేహితులతో కలిసి మిట్టపాలెంలో మద్యం తాగుతున్నాడు. అంతలోనే రాజా అటువైపు వచ్చాడు. ఆలీ భాయ్ వ్యవహారం చూసి అక్కడికి వచ్చాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో అదే అదనుగా భావించాడు. వెంటనే అక్కడినుంచి వెళ్లి తన స్నేహితులను తీసుకొచ్చాడు. అందరూ కలసి కత్తులతో ఒక్కసారిగా ఆలీ భాయ్ పై దాడి చేశారు. రాజా మరింత కోపంలో ఉండటంతో ఆలీ భాయ్ కడుపులో 15 సార్లు పొడిచాడు. అతని శరీరంపై 15కుపైగా కత్తిపోట్లు ఉండటం సంచలనంగా మారింది. ఆలీ భాయ్ స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ ఇన్‌ స్పెక్టర్‌ కె.వెంకటరెడ్డి, ఎస్సై లక్ష్మణరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హతుడు సునీల్ అలియాస్ ఆలీ భాయ్ పై గతంలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హంతకుల కోసం గాలిస్తున్నారు.