Nellore Ysrcp :     నెల్లూరు సిటీలో బాబాయ్, అబ్బాయ్ మధ్య రాజకీయం వార్నింగ్‌ల వరకూ వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ అనే పేరొక్కటీ ప్రస్తావించలేదు కానీ, పరోక్షంగా అనిల్ ని ఎన్ని మాటలనాలో అన్నీ అనేశారు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్. నిన్నామొన్నటి వరకూ నెల్లూరు సిటీలో బాబాయ్-అబ్బాయ్ కలసి రాజకీయాలు చేశారు. వరుసగా రెండు సార్లు అనిల్ కుమార్ యాదవ్ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారంటే అందులో రూప్ కుమార్ కష్టం కూడా ఉంది. కానీ అనిల్ రెండోసారి గెలిచి మంత్రి అయ్యాక కాస్త తేడా వచ్చింది. అనిల్, రూప్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ గొడవలు ఇప్పుడు పెరిగి పెద్దవయ్యాయి. ఎంతరవకు వచ్చాయంటే రూప్ కుమార్, అనిల్ ఆఫీస్ కి వెళ్లడం మానేశారు. తనకు తానే సొంతగా జగనన్న భవన్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు, శంకుస్థాపన చేసారు. దీంతో గొడవలు మరింత ముదిరాయి. 


రూప్ కుమార్ వర్గంలోని వ్యక్తిపై పోలీసు కేసులు ! 


రూప్ కుమార్ వర్గంలోని ఓ వ్యక్తిని పోలీసులు స్టేషన్ కి తరలించారు. దీంతో రూప్ వర్గం భగ్గుమంది, తన అనుచరుల్ని స్టేషన్ కి పిలిపించడం ఏంటని ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూర్చున్నారు. అతడ్ని విడిపించుకుని తీసుకొచ్చారు. ఎవరో ఫోన్లు చేసి చెబితే, బెదిరిపోయి తన మనుషుల్ని అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి సీన్లే రిపీటవుతాయని మాస్ వార్నింగ్ ఇచ్చారు రూప్ కుమార్ యాదవ్. దమ్ముంటే తనని టచ్ చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ఇటీవల నెల్లూరు సిటీలో రాజన్న భవన్ కి పోటీగా జగనన్న భవన్ ప్రారంభించిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఈరోజు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అనిల్ అనే పేరొక్కటీ ప్రస్తావించలేదు కానీ, నేరుగా ఆయన్నే టార్గెట్ చేశారు. నా మనుషుల్ని టచ్ చేసినా, నన్ను టచ్ చేసినా చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. 


అనిల్‌కు సినిమా చూపిస్తానంటున్న బాబాయ్ రూప్ ! 


జగనన్న భవన్ శంకుస్థాపన కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఇంకా ముందుకెళ్తే ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తానన్నారు. సొంత పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. రెండేళ్లలో ఎన్నికలున్నాయని, ఆ ఎన్నికల్లో ఎలా గెలవాలి, తిరిగి జగన్ ని సీఎం ఎలా చేయాలి అనే ఏర్పాట్లలో ఉండాలి కానీ, ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు చేయొద్దని హితవుపలికారు. సొంత పార్టీ నేతల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు రూప్ కుమార్ యాదవ్. అనిల్ అనే పేరెత్తకుండానే మాస్ వార్నింగ్ ఇచ్చారు రూప్ కుమార్. అనిల్ అనే పేరెత్తకుండా వార్నింగ్ ఇచ్చిన రూప్, త్వరలో నేరుగా పేరు పెట్టి హెచ్చరికలు జారీ చేసే సందర్భం వస్తుందని అంటున్నారు. ఎన్నికల విషయం చూడకుండా, జగన్ ని తిరిగి ఎలా సీఎం చేసుకోవాలనే విషయంపై దృష్టిపెట్టకుండా ఈ ప్రతీకార రాజకీయాలేంటని మండిపడ్డారు రూప్ కుమార్ యాదవ్. అది కూడా సొంత పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదంటున్నారు. 


కట్టుదాటిపోతున్న వైఎస్ఆర్‌సీపీ నేతల ఆధిపత్య పోరాటం ! 


 నెల్లూరు జిల్లాలో నిన్న మొన్నటి వరకూ వైసీపీలో అంతర్గత రాజకీయాలు జరిగినా అవి ఒక ఎమ్మెల్యేకు, ఇంకో ఎమ్మెల్యేకు మధ్య జరిగాయి. ఇప్పుడిలా ఒకే కుటుంబానికి చెందిన వారిలో విభేదాలు మొదలయ్యే సరికి నెల్లూరు సిటీ వైసీపీ నేతలకు ఏం చేయాలో దిక్కు తోచడంలేదు. ఇప్పటికే కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. మిగతా చోటా మోటా నాయకులు ఎవరివైపు వెళ్తే ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. చివరకు బాబాయ్-అబ్బాయ్ ఇద్దరూ కలసిపోతే.. మధ్యలో అటు ఇటు మారిన నాయకులే బలైపోతారని అంటున్నారు.