పోలీసులన్నాక తప్పు చేసిన వారికి వార్నింగ్ లు ఇస్తుంటారు. మోసపోయే అవకాశం ఉన్నప్పుడు మోసపోవద్దు బాబూ అంటూ వార్నింగ్ కూడా ఇస్తుంటారు. అయితే దాన్ని కాస్త సినిమా స్టైల్ లోకి మార్చేశారు ఏపీ పోలీసులు. అదెలాగా అంటారా..? ఇదిగో ఇలా..?


ఆమధ్య సైబరాబాద్ పోలీసులు ఓ రేంజ్ లో సినిమా పోస్టర్లతో మీమ్స్ వదిలేవారు. సజ్జనార్ ఆర్టీసీకి బదిలీ అయిన తర్వాత ఆర్టీసీ డిపార్ట్ మెంట్లో ఇలాంటి మీమ్స్ బాగా ఆకట్టుకున్నాయి. మొత్తమ్మీద తెలంగాణలో ఇలాంటి మీమ్స్ సంస్కృతి బాగా పాపులర్ అయింది. దాన్ని ఇప్పుడు నెల్లూరు పోలీసులు కూడా వంటబట్టించుకున్నారని అర్థమవుతోంది. నెల్లూరు పోలీసుల అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఈ మీమ్స్ వైరల్ గా మారాయి. 






పుష్ప, ఆర్ఆర్ఆర్, రఘువరన్ బీటెక్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలను తీసుకుని, వాటిలో నటీనటులు మాట్లాడుకుంటున్నట్టుగా మీమ్స్ తయారు చేసి ట్విట్టర్లో పెట్టారు నెల్లూరు పోలీసులు. ఇప్పుడీ మీమ్స్ వైరల్ గా మారాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఆలోచనలో పడేశాయి. ఆన్ లైన్ లో అప్పు తీసుకుంటే, తిరిగి చెల్లించాల్సిన సొమ్ము రెట్టింపవడంతోపాటు, వేధింపులు కూడా ఉంటాయనేది ఈమీమ్స్ సారాంశం. 


ఇటీవల నెల్లూరులో ఆన్ లైన్ లోన్ యాప్స్ వ్యవహారం బాగా చర్చకు వచ్చింది. ఏకంగా జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికే ఆన్ లైన్ లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేశారు. మీ పేరు షూరిటీగా పెట్టారండి అంటూ మాట్లాడారు. దానిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారిని అరెస్ట్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత నెల్లూరు జిల్లాకే చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇలాటే ఓ లోన్ యాప్ రికవరీ ఏజెంట్ తో కాస్త గట్టిగా మాట్లాడారు. అనిల్ వార్నింగ్ ఇస్తున్నా కూడా అవతలి యువతి ఏమాత్రం తగ్గకుండా బెదిరించాలనుకోవడం ఈ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్. 


ఈ దారుణ యాప్ ల బారిన పడొద్దని చెబుతున్నారు పోలీసులు. ఇక నెల్లూరు జిల్లా విషయానికొస్తే, జిల్లాలో విద్యార్థులు, చిరుద్యోగులు, వ్యాపారస్తులు, అవసరాల కోసం ఆన్ లైన్ లోన్  యాప్‌ ల వలలో చిక్కుతున్నారు. రుణం తిరిగి చెల్లించే క్రమంలో వడ్డీ ఎక్కువగా ఉండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. పర్సనల్ ఫొటోలను మార్ఫింగ్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ కి షేర్ చేస్తామని లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు భయపెడుతుండటంతో మరింతగా హడలిపోతున్నారు. పరువుపోతుందని ఓవైపు కంగారు పడుతున్నారు, మరోవైపు కుంగుబాటులు కోనే ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి యాప్‌ ల జోళికి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా ఇటీవల కాలంలో ఈ కేసులు ఎక్కువయ్యాయి. దీంతో వినూత్న రీతిలో పోలీసులు ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. 


తెలంగాణలో బాగా పాపులర్ అయిన పోలీసుల మీమ్స్.. సున్నిత హాస్యంతో ఎంతోమందికి కనువిప్పు కలిగించాయి. ఇప్పుడు ఏపీ పోలీసులు మొదలు పెట్టిన ఈ క్యాంపెయిన్ కూడా సున్నిత హాస్యంతో అందర్నీ ఆలోచింపజేసేలా చేస్తోంది. ముఖ్యంగా నెల్లూరు పోలీసులకు సోషల్ మీడియాలో హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.