సగటున ఉపాధి హామీ వేతనం రూ.240లు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రస్తుతం రూ. 205లు అందుతోందని దాన్ని పెంచాలని హితవు పలికారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వించారు. ఉపాధిహామీ పనులు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలో నాడు – నేడు, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం, జగనన్న భూ హక్కు, భూ రక్ష, స్పందన తదితర అంశాలపై చర్చించారు.


ఉపాధి హామీ పనుల్లో మంచి ప్రగతి కనిపించిందని సీఎం కితాబు ఇచ్చారు. పనితీరు బాగుందని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటున 117 శాతం పనిదినాల కల్పన జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర సగటు కన్నా తక్కువగా ఉన్న అన్నమయ్య, విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కాస్త దృష్టి పెట్టాలని తెలిపారు. ఉపాధి హామీలో దేశంలో 2వ స్థానంలో ఉన్నామని ఇలాగే పనులను కొనసాగించాలని తెలిపారు. 


సగటు వేతనం పెరగాల్సిన అవసరం ఉంది: జగన్


సగటున ఉపాధి హామీ వేతనం రూ.240లు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రూ. 205లుగా సగటున ఉందని.. దీన్ని రూ.240లకు చేర్చాలని తెలిపారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామ సచివాలయాల భవనాలు త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అక్టోబరు 31 నాటికల్లా వీటి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. డిసెంబరు నాటికి 4500 గ్రామాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ చేరుతుందని సీఎం జగన్ తెలిపారు. మంజూరు చేసిన 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాన్ని డిసెంబర్‌ నెలాఖరునాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


నాడు - నేడు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టండి..!


రెండో దశ కింద ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు – నేడు సహా ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలాని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మొదటి విడతలో 15,715 స్కూళ్లను బాగు చేశామని, రెండోవిడత కింద 22,279 స్కూళ్లలో నాడు – నేడు కింద పనులు చేపట్టినట్లు తెలిపారు. నాడు -నేడు నిధులను సకాలంలో అందజేస్తున్నామని.. పనుల్లో నాణ్యత ఉండాలని అన్నారు. ఆస్పత్రుల్లో పనుల పట్ల కూడా ఇదే తీరున పరిశీలన చేయాలన్నారు. స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్‌ను డిస్‌ప్లే చేయాని తెలిపారు.


ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.3,111.92 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. కలెక్టర్లు రెండో విడత కింద మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణంపైన దృష్టి పెట్టాలని సూచించారు. 10వేలకుపైగా ఇళ్లు విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, పెద్దసంఖ్యలో ఇళ్లు నిర్మించాల్సిన ఏలూరు లే అవుట్లపై సంబంధిత కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. కాలనీలు పూర్తయ్యే సమయానికి కరెంటు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించాలన్నారు. 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించే కార్యక్రమాన్నికూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిశీలన చేయాలని తెలిపారు. స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలన్నారు. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలని, ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లాకలెక్టర్లతో స్పందనపై సమీక్ష చేయాలని సూచించారు.


అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది..


దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యత పనుల కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం జగన్ అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. వృద్ధి రేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో రహదారులకు సంబంధించి 99 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. 3079 కిలోమీటర్ల మేర రూ. 29,249 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయని తెలిపారు. అంతర్‌ రాష్ట్ర సరిహద్దుల అనుసంధానం కోసం మరో 7 ప్రాజెక్టులు కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డీపీఆర్‌ స్థాయిలో మరో 45 ప్రాజెక్టులు ఉన్నాయని, మొత్తంగా 151 ప్రాజెక్టులు దాదాపు రూ.92 వేలకు పైగా కోట్లు ఈ ప్రాజెక్టులకోసం ఖర్చుచేస్తున్నామన్నారు. 


ప్రతీ మహిళ ఫోన్ లో దిశ యాప్ ఉండాలి..


ప్రతి ఇంటిలో ఉన్న మహిళ మొబైల్‌లో దిశ యాప్‌ ఉండాలని సీఎ జగన్ సూచించారు. ప్రతి వాలంటీర్, మహిళా పోలీసు సహకారంతో దిశ యాప్‌ను ప్రతి మహిళ మొబైల్‌లో డౌన్లోడ్‌ చేయించాలన్నారు. ప్రతి 15 రోజులకొకసారి దిశ యాప్‌ పనితీరును కూడా పర్యవేక్షించాలన్నారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలపైనా దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్, నార్కోటిక్స్, అసాంఘిక కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టాలని సూచించారు. ఈనెల 25న నేతన్న నేస్తం..  వచ్చేనెల 22న వైయస్సార్‌ చేయూత కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వివరించారు.