నెల్లూరు జిల్లా వెంటాచలం మండలం చెముడుగుంటలో యాసిడ్ దాడికి గురైన బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.5 లక్షలు అందించింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బాధిత కుటుంబానికి 5లక్షల రూపాయల చెక్కుని అందించారు జిల్లా నేతలు, అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, డీఐజీ డాక్టర్ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ విజయరావు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. బాధితురాలికి వరుసకు మేనమామ అయిన నాగరాజు అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా గుర్తించామని చెప్పారు. మైనర్ బాలిక గొంతులో యాసిడ్ పోసి కత్తితో గాయం చేసిన తర్వాత స్పృహ తప్పి పడిపోయిందని, బాలిక స్పృహలోకి వచ్చి పక్కనే ఉన్న తెలిసిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు సైగల ద్వారా తెలియజేసిందని అన్నారు. ప్పటికే ఆమె గొంతుకు గాయం కావడం వల్ల మాట్లాడలేకపోయిందని చెప్పారు. ప్రస్తుతం బాలికను మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించినట్టు చెప్పారు. నెల్లూరు జిల్లా పోలీసుల సత్వర స్పందనను ఆయన అభినందించారు. ఈ కేసును దిశ చట్టం ఉపయోగించి 7 రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేసి ట్రయల్స్ తొందరగా జరిగేలా చూసి నిందితులకు కఠిన శిక్ష కూడా పడేలా చేస్తామన్నారాయన.
రేప్ జరగలేదు..
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో మైనర్ బాలిక రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలక్కడ రేప్ జరగలేదని చెబుతున్నారు పోలీసులు. కేవలం దొంగతనం మాత్రమే జరిగిందని అంటున్నారు. నిందితుడు మేనమామ నాగరాజేనని నిర్థారించారు. నెల్లూరు డీఎస్పీ హరినాథ్ రెడ్డి వివరాల మేరకు ఉదయం ఒకసారి బాలిక ఒంటరిగా ఇంటిలో ఉండగా నాగరాజు లోపలికి వెళ్లాడు. ఆమె చెవి కమ్మలు లాక్కొని వచ్చాడు. రెండోసారి ఆ అమ్మాయిని అడిగి కూర తీసుకెళ్లాడు. సాయంత్రం వచ్చి అదే కూరగిన్నెలో యాసిడ్ పోసి గుడ్డ ముక్కతో అమ్మాయి మొహంపై చల్లాడు. ఆ ధాటికి ఆ బాలిక స్పృహతప్పి పడిపోగా, కత్తితో దాడి చేసి, ఇంటిలోని నగదు దోచుకెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. స్పృహతప్పిన ఆ బాలిక.. నిందితుడి ఆనవాళ్లను తోటివారికి చెప్పిందని డీఎస్పీ హరినాథ్ రెడ్డి చెబుతున్నారు. నిందితుడిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశ పెడతామన్నారాయన. తాగుడికి బానిసైన నాగరాజుని గతంలోనే భార్య వదిలేసిందని, తన సొంత మేనమామ కూతురిపై ఇప్పుడిలా దాడి చేశాడని పోలీసులు వివరించారు.
బాలికపై రేప్ అటెంప్ట్ అంటూ ఈ వార్త సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉండటంతో అధికారులు హడావిడి పడ్డారు. అప్పటికే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఆ తర్వాత మరింత మెరుగైన వైద్యం కోసం బాలికను చెన్నైకి తరలించారు. ఇటు కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం అండగా నిలబడింది. బాధితురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల తక్షణ సాయం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.