సంగం, పెన్నా బ్యారేజ్‌ల ప్రారంభోత్సవం కోసం నెల్లూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్.. సంగం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన రెండు బ్యారేజ్లను ఇప్పుడు తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారాయన. వైఎస్ఆర్ తర్వాత నాయకులెవరూ వాటిని పట్టించుకోలేదని, వైసీపీ హయాంలోనే ఇప్పుడు ప్రాజెక్ట్‌లు, బ్యారేజ్ల నిర్మాణం ఊపందుకుందని అన్నారాయన. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 సాగునీటి ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో తీసుకుని ఉరుకులు పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్. అప్పట్లో ఆ పెద్దాయన ప్రారంభించిన ప్రాజెక్ట్ లను, ఇప్పుడు తాను పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు.


సంగం బ్యారేజ్ ద్వారా పెన్నా డెల్టా, కనుపూరు కాలువ, కావలి కాలువల ద్వారా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉపయోగం కలుగుతుందన్నారు జగన్. పొదలకూరు సంగం మండలాల మధ్య గల రాకపోకల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశముందన్నారు. 


ఆత్మకూరు నియోజకవర్గంపై వరాల జల్లు.. 


సీఎం జగన్ కంటే ముందు సభలో ప్రసంగించిన స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అభ్యర్థనలను సీఎం ముందు ఉంచారు. వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు. ఆయన ప్రసంగం అయిన తర్వాత సీఎం జగన్ సభలో మాట్లాడారు, విక్రమ్ రెడ్డి ప్రస్తావించిన అన్ని అంశాలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 
- సంగం బ్యారేజ్ - జాతీయ రహదారిని కలిపేందుకు ఏర్పాటు చేసే రోడ్డు కోసం రూ.15కోట్లు మంజూరు చేస్తున్నానని అన్నారు జగన్.
- ఆత్మకూరు నియోజకవర్గంలో 12 వర్క్ లకు సంబంధించి 40కోట్ల రూపాయలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
- ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో రోడ్లు లేని 25 ఊళ్లకు రూ.14కోట్లు మంజూరు చేశారు 
- ఆత్మకూరు మున్సిపాల్టీకి స్పెషల్ గ్రాంట్ కింద 12 కోట్ల రూపాయలు ఇచ్చారు. 
- సంగం ప్రాజెక్ట్ నుంచి సంగం పంచాయితీకి మంచినీటి సౌకర్యం కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు
ఇలా మొత్తం 85 కోట్ల రూపాయలు ఆత్మకూరు నియోజకవర్గానికి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. 


సంగం సభలో స్పెషల్ స్టేటస్ ప్రస్తావన.. 
సంగం సభలో ప్రసంగించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఏపీకి స్పెషల్ స్టేటస్ రావడం తథ్యమంటూ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పడుతుందని, ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పారాయన. వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందని, నీటి పారుదలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా జగన్ హయంలోనే పూర్తవుతుందని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రిలాగా ఏపీకి కూడా జగన్ నిరంతర ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. 


పొలిటికల్ పంచ్ లు లేవు.. 
జగన్ తోపాటు, అంబటి రాంబాబు కూడా ఈ సభా వేదికపై ప్రసంగించినా ఎక్కడా పొలిటికల్ పంచ్ లు వేయలేదు. కార్యక్రమం, జిల్లా అభివృద్ధి, రాష్ట్రంలో చేస్తున్న పనులనే ఎక్కువ ప్రస్తావించారు.