ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలకు తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో ఆమోదించింది. నిన్న సాయంత్రం ఒంగోలులో సమావేశమైన పొలిట్ బ్యూరో 17 తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ 17 కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినవే.  


మహానాడులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 12 తీర్మానాలు... తెలంగాణకు సంబంధించి 3 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మిగిన ఒక్క తీర్మానం అండమాన్‌కు సంబంధించింది. వీటితోపాటు రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది. మహానాడు ప్రతినిధుల సభ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఒక్కో తీర్మానంపై యాభై మంది వరకు మాట్లాడే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర ఒక నాటకంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో కామెంట్ చేసింది. అసలు ఏ వర్గానికి న్యాయం చేసిందీ ప్రభుత్వం అని ప్రశ్నించింది తెలుగుదేశం. వైసిపికి మొత్తం 9 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో నలుగురు రెడ్డీ వర్గానికి చెందిన వారే ఉన్నారని విమర్శించింది. అందులో ముగ్గురు ఇతర్రాష్ట్రాలకు చెందిన వారేనని ముగ్గురు జగన్‌తోపాటు కేసుల్లో ఉన్న వారేనని ఆరోపించింది. లాబీయింగ్ చేసేవారికి, కేసుల్లో సహ ముద్దాయిలకు జగన్ రాజ్యసభ ఇచ్చారని అన్నారు.






తెలంగాణలో 12 కులాలను బీసీ జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడం ఏ రకంగా సమంజసమో చెప్పాలని ప్రశ్నించింది తెలుగుదేశం. మైనారిటీలకు రిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుపడిన ఆర్ కృష్ణయ్య తప్ప ఏపిలో రాజ్యసభ ఇవ్వడానికి బిసి నేతలే లేరా అని నిలదీసింది. 9 మంది రాజ్యసభలో ఒక ఎస్సి కానీ, ఒక ఎస్టి కానీ, ఒక మైనారిటీ కానీ లేరని గుర్తు చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని పొలిట్ బ్యూరో తప్పుపట్టింది. ఇలా ప్రతి అంశంలోనూ ఏ వర్గానికి న్యాయం వైసిపికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత...యాత్ర చేసే హక్కు లేదని పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించింది.