Krishnapatnam Port vs Ramayapatnam Port: చెన్నై ఓడరేవుకి ఏపీలోని కృష్ణపట్నం ఓడరేవు (Krishnapatnam Port)కి మధ్య దూరం 190 కిలోమీటర్లు. పైగా రాష్ట్రాలు వేరు కనుక, ఎవరి వ్యాపారం వారిది, ఎవరి ఎగుమతులు, దిగుమతుల ప్రాధాన్యం వారికి ఉంటుంది. అయితే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవుకి, అదే జిల్లాలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న రామాయపట్నం పోర్ట్ (Ramayapatnam Port)కి మధ్య దూరం 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ప్రస్తుతం కృష్ణపట్నం ఓడరేవు ఉండగా, దానికి దగ్గరలోనే అదే జిల్లాలో రామాయపట్నం నిర్మించడానికి కారణం ఏంటనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో మొదలైంది.


ప్రభుత్వ ఆధీనంలో ఓడరేవు ఉండాలని.. 
కృష్ణపట్నం ఓడరేవు ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంది. ప్రస్తుతం పోర్ట్ యాజమాన్యం అదానీ గ్రూప్ చేతుల్లో ఉంది. అయితే ప్రభుత్వ అధీనంలో ఓడరేవు ఉండాలనే భావన ఉంది. విభజన చట్టంలో కేంద్రం ఏపీకి స్పష్టమైన హామీ ఇచ్చింది. దుగరాజపట్నం వద్ద ఓడరేవుని పూర్తిగా కేంద్ర నిధులతోనే నిర్మించి ఇచ్చేందుకు సుముఖత చూపించి, ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలన్నీ ఎలా అటకెక్కాయో.. అలాగే దుగరాజపట్నం పోర్ట్ హామీ కూడా అటకెక్కింది. అసలా పోర్ట్ కి చిల్లిగవ్వ విదిల్చేది లేదంటూ కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలోనే దుగరాజపట్నం పోర్ట్ ఏర్పాటయితే కొత్తగా ఏర్పడే దుగరాజపట్నం పోర్ట్ అభివృద్ధి సాధ్యం కాదని, అది ఓడరేవు నిర్మాణానికి లాభదాయకమైన ప్రాంతం కాదని కూడా తేల్చారు. దాంతో ఏపీ ప్రభుత్వం రామాయపట్నం వైపు మొగ్గు చూపింది. 10,660 కోట్ల రూపాయల వ్యయంతో 3 వేల 437 ఎకరాల్లో 19 బెర్తులతో రెండు దశల్లో ఓడరేవు నిర్మాణం జరగనుంది.




దశాబ్దం కిందటే పోర్ట్‌ ఆలోచన.. 
రామాయపట్నం ఓడరేవుకు 2012లో బీజం పడింది. అప్పటి పురపాలకశాఖమంత్రి మానుగుంట మహీధర్‌ రెడ్డి పోర్టు నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదిక పంపారు. ఆ తర్వాత 2014లో అదికారంలోకి వచ్చిన టీడీపీ రామాయపట్నం ఓడరేవుపై దృష్టి పెట్టింది. 2016లో రైట్స్‌ సంస్థతో పోర్టుల నిర్మాణానికి అనువైన ప్రాంతంపై సర్వే చేయించింది. రామాయపట్నం వైపు మొగ్గు చూపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మైనర్‌ పోర్టుగా నిర్మించాలని భావించింది. 2019 జనవరిలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.




ప్రభుత్వం మారడంతో ఆతర్వాత పనులు ముందుకు సాగలేదు. తాజాగా మరోసారి సీఎం జగన్ శంకుస్థాపనతో ఈ పోర్ట్ విషయంలో అడుగు ముందుకు పడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు పంచాయతీలోని మొండివారిపాళెంలో సీఎం జగన్‌ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతోంది. 


ప్రకాశం జిల్లానుంచి ప్రధానంగా గ్రానైట్, పొగాకు ఉత్పత్తుల ఎగుమతులకు ఈ పోర్ట్ ఉపయోగపడుతుంది. దీనికి అనుసంధానంగా కాగితాల పరిశ్రమ ఏర్పాటుకి కూడా గతంలో ప్రణాళికలు రచించారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే పోర్ట్ నిర్మాణానికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఇక కృష్ణపట్నం ప్రైవేటు భాగస్వామ్యంలోనే పోర్ట్. ఎగుమతులు, దిగుమతులపై రాయితీలు, ఇతరత్రా వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం మాట అక్కడ అధికారికంగా చెల్లుబాటు కాదు. దీంతో పూర్తిగా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఈ మైనర్ పోర్ట్ ఏర్పాటవుతుంది. 




ఈ పోర్ట్ నిర్మాణంతో తెలంగాణ, ఛత్తీస్‌ గఢ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం అవుతాయి. బొగ్గు, ఇనుపఖనిజం, గ్రానైట్, ఆహార ధాన్యాలు, బియ్యం సహా ఇతర ధాన్యాలు, సిమెంటు, ఫెర్టిలైజర్స్, పొగాకు, మిర్చి, ఆక్వా ఉత్పత్తులు, కంటైనర్ల రవాణాలో ఈ పోర్ట్ కీలకం కాబోతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగానికి రామాయపట్నం పోర్ట్ ద్వారా మరింత ఉపయోగం ఉంటుందని ప్రభుత్వం బావిస్తోంది. ఔషధాలు, రసాయనాలు, ప్లాస్టిక్, ఖనిజాలు, చేతి వృత్తులు, టెక్స్‌టైల్స్, లెదర్‌ తదితర ఎగుమతుల్లో రాయాయపట్నం పోర్టు కీలకంగా మారుతుందని, కృష్ణపట్నం పోర్టుపై భారం తగ్గుతుందని మైనర్ పోర్ట్ గా ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది కేంద్రం. మూడేళ్లు టార్గెట్ పెట్టుకుని ఫస్ట్ ఫేజ్ పనులు మొదలు పెడుతున్నారు. అనుకున్న విధంగా సకాలంలో నిధులు విడుదలై, పోర్ట్ నిర్మాణం పూర్తయితే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. మిగతా ప్రాజెక్టుల్లాగే నిధుల కొరతతో నత్తనడకన పనులు సాగితే మాత్రం రామాయపట్నం ప్రభుత్వానికి గుదిబండలా మారే ప్రమాదం ఉంది.