నెల్లూరు వైసీపీ అంతర్గత రాజకీయాలు రంజుగా మారాయి. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత విభేదాలు మరింత రచ్చకెక్కేలా కనిపిస్తున్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి రాగానే ఆనం రామనారాయణ రెడ్డి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు, అభినందించారు. మిగతా వారు బెజవాడలో కలసి శుభాకాంక్షలు చెప్పారు. కానీ మరో వర్గం మాత్రం ఆయనకు దూరంగా ఉంది. కాకాణికి మంత్రి పదవి రావడం నెల్లూరు వైసీపీలో కొందరికి ఇష్టంలేదనే ప్రచారం ఉంది. 


అనిల్ మాటల్లో ఆంతర్యమేంటి..?
నెల్లూరు జిల్లానుంచి గతంలో ఇద్దరు మంత్రులున్నారు. జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ పనిచేశారు. ఐటీ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి పదవిలో ఉండగా మరణించారు. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు ఒకటే పదవి లభించింది. కాకాణి గోవర్దన్ రెడ్డికి వ్యవసాయ శాఖ కేటాయించారు సీఎం జగన్. ప్రస్తుతం కాకాణి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే కాకాణికి ఎంతమంది ఎమ్మెల్యేల సహకారం ఉంటుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. కాకాణి ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం లేదని కుండబద్దలు కొట్టారు. ఆహ్వానం ఉండి ఉంటే తాను వెళ్లేవాడినని, కానీ తనకు ఇన్విటేషన్ లేదని, అందులోనూ తనకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లలేదని చెప్పారు. తనను కాకాణి పిలిచారా అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. 


రుణం తీర్చుకుంటా.. రెట్టింపు ప్రేమ ఇస్తా.. 
గతంలో తాను మంత్రిగా పనిచేసినప్పుడు కాకాణి చూపించిన ప్రేమ, వాత్సల్యం.. అన్నిటినీ తిరిగి ఆయనకు ఇచ్చేస్తానని, తానెవరి రుణం ఉంచుకునే మనిషిని కాదని సెటైర్లు వేశారు అనిల్. కాకాణికి తన ప్రేమను రెట్టింపు స్థాయిలో ఇచ్చేస్తానన్నారు. ఇక జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే తనకు సహకరించారంటూ పేరు పేరునా ప్రస్తావించిన అనిల్.. కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు మాత్రం చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగానే వారిద్దరి పేర్లు ఆయన ప్రస్తావించలేదని తెలుస్తోంది. కాకాణి తనకు సహకరించారంటూనే తానెవరి రుణం ఉంచుకోనని అనిల్ అనడం చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గంలో కాకాణి శాఖకు సంబంధించిన పనులేవైనా ఉంటే ఆయన్ను కూడా ఆహ్వానిస్తామన్నారు అనిల్.


గతంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా అనిల్ మంత్రి పదవిలో ఉండగానే ఆయన నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్తానని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య పెద్దగా మాటల్లేవు. ఇక కాకాణి నియోజకవర్గంలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు అప్పట్లో జిల్లా మంత్రి అనిల్ కి ఆహ్వానం అందలేదు.  అప్పటి నుంచి వారిద్దరి మధ్య కూడా సఖ్యత లేదు. తీరా అది ఈరోజు అనిల్ ప్రెస్ మీట్ లో బహిర్గతమైంది. రెట్టింపు స్థాయిలో సహకారం అందిస్తామంటూ అనిల్ సెటైరిక్ గా మాట్లాడటం సంచలనంగా మారింది. 


మొత్తమ్మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత రాజకీయాలు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓ జట్టుగా కనిపిస్తున్నారు. మిగతావారంతా మరో జట్టుగా మారే అవకాశముంది. మరి ఈ విభేదాలు అధిష్టానం వరకు వెళ్తాయా..? లేక స్థానికంగానే వాటికి పరిష్కారం లభిస్తుందా అనేది వేచి చూడాలి.