Ex Minister Anil Satires On Pawan Kalyan: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు బిచ్చం నాయక్ అని విమర్శించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తన హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్ని వివరించారు. మంత్రి పదవులు లేకపోయినా తాము పార్టీ కోసం కష్టపడతామని, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ దగ్గర 20, 30 సీట్లు అడుక్కునే జనసేనానిని బిచ్చం నాయక్ అనే అంటారని అన్నారు అనిల్. జనసైనికులు తనని ట్రోల్ చేసినా తానేమీ వెనకాడబోనని చెప్పారు. 


మంత్రి పదవులు పోయినందుకు తమకెవరికీ బాధ లేదని, గర్వంగా ఉందని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గతంలో మంత్రి పదవి ఉంది కాబట్టి.. కాస్త ఆచితూచి మాట్లాడామని ఇప్పుడు డబుల్ ఫోర్స్ తో వెళ్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అటాక్ చేసే విషయంలో తగ్గేదే లేదన్నారు అనిల్.


మళ్లీ గెలుస్తాం, మళ్లీ మంత్రులవుతాం..
ప్రస్తుతం తమను పార్టీ కోసం పనిచేయాలని సీఎం జగన్ సూచించారని, తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ పాతవారంతా మంత్రి పదవుల్లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు అనిల్ కుమార్ యాదవ్. రెండేళ్లపాటు తమని పార్టీకోసం పనిచేయాలని జగన్ ఆదేశించారని, ఆయన మాట శిరసావహించే సైనికులం, సేవకులం తామని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. పార్టీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా మంత్రులం అవుతామని అన్నారు. 


త్వరలో జనంలోకి వస్తా..
గతంలో అనిల్ ఎలా ఉండేవారో, మరోసారి అలాగే నిత్యం జనాలకు అందుబాటులో ఉంటానని అన్నారు అనిల్. త్వరలో కార్యకర్తలతో సమావేశం పెట్టుకుని మంచి మహూర్తం చూసుకుని జనాల్లోకి వస్తానని అన్నారు. జనంలో ఉండి మళ్లీ గెలుస్తామని, పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు అనిల్. 


కోట్ల రూపాయల నిధులు తెచ్చింది నేనే..
మంత్రిగా తాను నెల్లూరు నగరానికి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టానని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నగరానికి ఫ్లై ఓవర్ తెచ్చానని, తన హయాంలోనే నెల్లూరు బ్యారేజ్ పనులు ముందుకు జరిగాయని, పెన్నా నదికి బండ్ నిర్మించబోతున్నామని చెప్పారు. సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువ అభివృద్ధి పనులు తన హయాంలోనే మొదలయ్యాయని, తనకు అది గర్వంగా ఉందన్నారు. పనులు పూర్తయినా, కాకపోయినా తన హయాంలో పనులు మొదలయ్యాయని గుర్తు చేశారు. 


కుటుంబంలో అలకలు ఉండవా..?
కుటుంబం అన్నాక అలకలు కోప తాపాలుంటాయని, అలాంటిదే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత జరిగిందని చెప్పారు అనిల్. ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు కదా అన్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు అనిల్. ప్రస్తుతం రాజీనామాలు, ఇతర నిరసనలు ఇలాంటివన్నీ త్వరలోనే సర్దుకుంటాయన్నారు అనిల్.