ఏపీలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలిసిందే. నెల్లూరు జిల్లాలో కూడా దీనికి మినహాయింపేమీ లేదు. ఎక్కడికక్కడ రోడ్లు మరమ్మతులకు నోచుకోకుండా ప్రజలకు నరకం చూపెడుతున్నాయి. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎన్నిసార్లు పర్యటనలకు వచ్చినా, గుంతల రోడ్లపై అవస్థలు పడ్డారే కానీ, వాటి మరమ్మతులకు నిధులు తేవడం మంత్రులకు కూడా సాధ్యం కాలేదు. నెల్లూరు జిల్లా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎట్టకేలకు తన నియోజకవర్గంలో రోడ్డు పనులు మొదలు పెట్టించారు. జిల్లాలోనే తొలిసారిగా ఆత్మకూరు పరిధిలో బైపాస్ రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. బైపాస్ రోడ్డు మరమ్మతులకు 77 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. 




ఆత్మకూరు పట్టణానికి ప్రధాన రహదారిగా ఉన్న బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ప్రారంభించారు. ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెంకట్రావుపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆత్మకూరు బైపాస్ రోడ్డు దుస్థితిని ప్రత్యక్షంగా గమనించారు. స్థానికులనుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వెంటనే మరమ్మతులు చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు పనులు మొదలయ్యేలా చొరవ చూపారు. టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనులు మొదలు పెట్టారు. 




మరమ్మతులతో సరిపెడతారా..?
గతంలో కూడా రోడ్లు మరమ్మతులు చేసిన వెంటనే తిరిగి పాడయ్యేవి. అందులోనూ ఇటీవల భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. చిన్న చిన్న మరమ్మతులతో సరిపెడుతున్నారు కానీ, పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులకు ఎవరూ నడుంబిగించలేదు. అయితే ఈసారయినా ఆత్మకూరు బైపాస్ రోడ్డుకి పూర్తి స్థాయిలో మరమ్మతులు జరుగుతాయా, లేక తాత్కాలిక పనులు చేసి అధికారులు మమ అనిపిస్తారా వేచి చూడాలి. 


మొత్తమ్మీద గుంతల రోడ్లతో అవస్థలు పడిన ప్రజలు మాత్రం పనులు మొదలయ్యే సరికి కాస్త ఊరట చెందారు. జిల్లా అంతటా ఇలాంటి రోడ్లు చాలానే ఉన్నాయని, వాటికి కూడా మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఓవైపు సీఎం జగన్ రోడ్ల మరమ్మతులు మొదలు పెట్టాలని ఆదేశాలివ్వడం, పనులు మొదలవుతున్నాయని సంకేతాలివ్వడం, సమీక్షలు, సమావేశాలు.. ఇలా హడావిడి జరుగుతున్నా.. ప్రత్యక్షంగా మాత్రం పనులు మొదలైన దాఖలాలు తక్కువ. మంత్రులు చొరవ తీసుకుని తమతమ నియోజకవర్గాల్లో అయినా నిధులు విడుదల చేయించుకుని రోడ్డు పనులు చేయించుకుంటున్నారు. 


Also Read: Schools Reopen: స్కూల్స్ రీఓపెన్.. భౌతిక తరగతుల నిర్వహణకు పేరెంట్స్ పర్మిషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం


Also Read: Gold Rate Today: గుడ్ న్యూస్.. నిలకడగా పసిడి ధర.. స్వల్పంగా దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ