ఏపీలో జిల్లాల విభజన కొంచెం ఇష్టం - కొంచెం కష్టం అన్నట్టుగా ఉంది. కొత్త జిల్లాల్లోకి వెళ్లిపోయేవారు, జిల్లా కేంద్రంనుంచి దూరంగా విసిరివేయబడినవారు తలపట్టుకున్నారు. తమకేంటీ కష్టం అని రోడ్డెక్కారు. ఉంటే పాత జిల్లాలో ఉంచండి, లేకపోతే మాదే ఒక జిల్లా చేయండి అంటూ నినదిస్తున్నారు. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్లతో పంచాయితీ జరుగుతోంది. ఇక కొన్ని చోట్ల మాత్రం పండగ వాతావరణం నెలకొంది. జిల్లాల ఏర్పాటుని స్వాగతిస్తూ చాలా చోట్ల సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిగాయి, జగన్ కి ధన్యవాదాలు చెబుతూ ర్యాలీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు స్థానికులు. 


సర్వేపల్లిలోనే ఎందుకు..? 
"జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" ఇదీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వారోత్సవాల పేరు. జిల్లాల విభజన తర్వాత సర్వేపల్లి ప్రజలు సంబరపడిపోడానికి బలమైన కారణమే ఉంది. వాస్తవానికి సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. అంటే తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాలో సర్వేపల్లి ఉండాలన్నమాట. రాష్ట్రమంతా పార్లమెంట్ నియోజకవర్గాలను బేస్ చేసుకుని కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిలో ఉన్న ఒకటీ రెండు మినహాయింపుల్లో సర్వేపల్లి ఒకటి. ఇలా ఏకంగా ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొత్తానికి మొత్తం పక్క జిల్లాలో కలిపిన దాఖలాలు లేవు. అంటే నెల్లూరు నగరానికి చుట్టు పక్కలా విస్తరించి ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం స్థానం మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. దీంతో స్థానికులంతా జగన్ కి ధన్యవాదాలు చెబుతున్నారు. 




కాకాణి నాయకత్వం.. 
నెల్లూరు నుంచి సర్వేపల్లి విడిపోతే.. సర్వేపల్లి ప్రజలకు వచ్చే నష్టం కంటే.. నెల్లూరు జిల్లానే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోతుంది. కృష్ణపట్నం పోర్టు, దానికి అనుబంధంగా ఉన్న కంపెనీలన్నీ పక్క జిల్లాకు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విక్రమ సింహపురి యూనివర్శిటీ కూడా త్యాగం చేయాల్సిందే. దీంతో సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే ఉండటం.. ఒకరకంగా నెల్లూరు జిల్లాకే ఎక్కువ ప్రయోజనం. దీనికితోడు స్థానిక సమస్యలను సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీసుకెళ్లారు. సర్వేపల్లిని విడదీస్తే రెండు ప్రాంతాల ప్రజలు నష్టపోతారని చెప్పారు. కాకాణి తన వాదన బలంగా వినిపించడంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వేపల్లిని నెల్లూరులోనే ఉంచడానికి నిర్ణయించింది. అందుకే కృతజ్ఞతగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలిరోజున బైక్ ర్యాలీ చేపట్టారు. ఊరూరా, వాడవాడలా అన్ని స్కూళ్లలో కార్యక్రమాలు పెడుతున్నారు. జగన్ భారీ ఫ్లెక్సీకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. 




మొత్తం వారం రోజులపాటు ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. "జగనన్న వరం - సర్వేపల్లి జన నీరాజనం" పేరుతో వారం రోజులపాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉత్సవాలు చేపట్టారు సర్వేపల్లి ప్రజలు.