బావిలో బెల్లం, పీఠంపై ఉప్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఆచారం..


ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. చారిత్రక నేపథ్యం లేకపోయినా భక్తుల నమ్మకమే ఆయా ఆలయాల ప్రాముఖ్యతను పెంచుతుంది. నెల్లూరు నగరంలో కూడా ఆలయం ఒకటి ఉంది. అదే వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానం. నెల్లూరులోని దర్గామిట్ట, రామ్ నగర్ పరిధిలో ఈ ఆలయం ఉంది. ప్రతి శనివారం, అమావాస్య రోజు భక్తులకు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఏడాదికోసారి థై అమావాస్య సందర్భంగా ఇక్కడికి భక్తులు పోటెత్తుతారు. 


వేమాలశెట్టి బావి.. 
వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానంలో వేమాల శెట్టి బావి చాలా ప్రత్యేకం. ఆలయం ఆవరణలోనే ఈ బావి ఉంటుంది. ఇక్కడ భక్తులు బెల్లం సమర్పిస్తుంటారు. ఆలయానికి వచ్చేవారు ఈ బావిలో బెల్లం వేసి తమ ఆరోగ్యం కుదుటపడాలని, లేదా తమ బంధువుల ఆరోగ్యం బాగుంటాలని కోరుకుంటారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగైన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి బెల్లం సమర్పిస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేరాయని కొంతమంది భక్తులు ప్రచారంతో ఈ ఆలయానికి ఎక్కడలేని పేరొచ్చింది. జిల్లావ్యాప్తంగా థై అమావాస్య రోజున భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.




ఆలయ చరిత్ర ఏంటి..?
నెల్లూరులోని వైద్య వీర రాఘవ స్వామి దేవస్థానానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని అంటారు. అప్పట్లో వేమాలమ్మ, వేమాల శెట్టి అనేవారు ఇక్కడ ఆలయం కట్టాలని, అక్కడే బావి తవ్వేందుకు ఉపక్రమించారట. కానీ ఎంతకీ ఆ బావి పూర్తి కాకపోవడంతో దిగులు పడ్డారట. వైద్య వీర రాఘవ స్వామి వారికి కలలో ప్రత్యక్షమయ్యారని, వారు జలసమాధి అయ్యారని, అక్కడే బావి ఏర్పడిందని చెబుతారు. 




ఆలయంలోని పీఠంపై ఉప్పు, మిరియాలు వేసి దేవుడికి మొక్కుకుంటారు భక్తులు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో బెల్లం సమర్పిస్తారు. ముఖ్యంగా మహిళలు ఇక్కడ బెల్లం సమర్పించి కోర్కెలు కోరుకుంటారు. ఆరోగ్యం మెరుగవడంకోసం ఈ ఆలయానికి వస్తుంటారు భక్తులు. తమిళనాడులోని తిరువళ్లూరులో కూడా వైద్య వీర రాఘవ స్వామి ఆలయం ఉందని, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం అని చెబుతున్నారు నిర్వాహకులు. 


ఒకసారి ఈ ఆలయం గురించి తెలిసి ఇక్కడికి వచ్చినవారు, కచ్చితంగా మళ్లీ మళ్లీ వస్తుంటారనేది నమ్మిక. ప్రతి శనివారం, అమావాస్య రోజుల్లో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటంది. ఇక ఏడాదికోసారి వచ్చే థై అమావాస్య రోజు మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. మొక్కు చెల్లించుకుంటారు. బావిలో బెల్లం సమర్పించి తమ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు.