Schools Reopen: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో  దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలను తిరిగి తెరవడంపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను సవరించింది. విద్యార్థులు నేరుగా తరగతులకు హాజరు కావడానికి తల్లిదండ్రుల సమ్మతి కచ్చితంగా అవసరం లేదని, ఈ విషయంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చునని సూచించారు.


బ్రిడ్జి కోర్సులను సిద్ధం చేయడంతో పాటు విద్యార్థులపై దృష్టి సారించడం, ప్రతి విద్యార్థి సిలబస్‌లో ఉన్న పుస్తకాలను మించి చదివేలా చేస్తూ ఆన్‌లైన్ క్లాసుల ద్వారా టీచింగ్ చేయడంపై ఫోకస్ చేయాలని సైతం తాజా మార్గదర్శకాలలో పేర్కొంది. పాఠశాలల పునఃప్రారంభం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2020 అక్టోబర్‌లో, ఆ తరువాత గత ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత పాఠశాల ప్రామాణిక నిర్వహణ విధానాలలో కొన్ని మార్పులు చేసింది. భౌతికంగా తరగతులకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతిని తీసుకోవాలా వద్దా అని రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్రం కల్పించింది. అంటే తల్లిదండ్రుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్న నిబంధనను సవరించారు.


ఢిల్లీలోని 400 కి పైగా పాఠశాలల నుంచి అభిప్రాయాన్ని సేకరించిన అనంతరం.. ఎటువంటి ఆలస్యం లేకుండా తిరిగి విద్యా సంస్థలు తెరవాలని రాష్ట్రాలకు సూచించారు. విద్యాసంస్థలు పున ప్రారంభించడంలో అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు, డీడీఎంఏ సభ్యులకు అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ రిక,గ్నైజ్డ్ స్కూల్స్ యాక్షన్ కమిటీ సెక్రటరీ భరత్ అరోరా విజ్ఞప్తి చేశారు. భౌతికంగానే నేర్చుకోవడం జరగాలని అంతా భావించారు. అన్ని తరగతుల వారికి స్కూల్ తెరవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అసోసియేషన్ ఇటీవల లేఖ రాసింది.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో.. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా విద్యార్థులు చదువులో ఎంతో నష్టపోతున్నారని, నేర్చుకోవడంలో లోపాలు తలెత్తుతున్నాయని ప్రస్తావించారు. విద్యార్థల కోసం ‘వన్ క్లాస్ వన్ టీవీ ఛానెల్’, PM e-Vidya పథకం కింద 12 నుండి 200 వరకు ఛానెల్‌లు తీసుకువస్తామని ప్రకటించారు.


భౌతిక తరగతులు పునఃప్రారంభించిన తర్వాత విద్యార్థుల ఏ ఇబ్బంది లేకుండా చదువుకునే వాతావరణం కల్పించాలి. ఒత్తిడికి గురై స్కూలు మానివేయడం లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాజా మార్గదర్శకాలలో పేర్కొన్నారు.  డ్రాప్-అవుట్‌లను నివారించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన విద్యార్థులను సైతం గుర్తించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. 


విద్యార్థులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు మానసిక ఆరోగ్యం అందించడానికి ‘మనోదర్పణ్’ ప్రోగ్రామ్ యొక్క సేవలను పొందేందుకు వాటాదారులను ప్రోత్సహించాలని రాష్ట్రాలు మరియు UTలను కేంద్రం కోరింది. ఈ సవరించిన మార్గదర్శకాలను డిసెంబర్ 2021లో విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు పంపించారు. కానీ ఒమిక్రాన్ వ్యాప్తితో స్కూళ్లు మరోసారి మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి తగ్గడంతో పలు రాష్ట్రాలు, యూటీలు ఇప్పటికే పాఠశాలలను తిరిగి తెరవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను వెల్లడించింది. విద్యార్థులను స్కూళ్లను పంపాలా వద్దా.. అని తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలా వద్దా అనే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పట్టడంతో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు పాఠశాలలను గ్రేడ్ పద్ధతిలో తిరిగి తెరవడం ప్రారంభించాయి.


కరోనా కారణంగా నిర్వహిస్తున్న ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం తగ్గినట్లు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (UNICEF) తెలిపింది. కోవిడ్-19 సమయంలో 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులలో కనీసం 80% మంది భౌతిక తరగతులకు హాజరుతో పోల్చితే ఇంటి నుంచి చాలా తక్కువగా నేర్చుకున్నారట. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం, స్కూల్స్ మూసివేసిన సమయంలో 29 మిలియన్ల పాఠశాల విద్యార్థులకు పరికరాలు అందుబాటులో లేక తరగతులకు హాజరుకాలేదు. జూన్ 2021 వరకు 24 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి డేటా సేకరించారు. దీర్ఘకాలం మూసివేత కారణంగా భవిష్యత్ ఆదాయాలలో 400 బిలియన్లకు పైగా నష్టాన్ని  ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.