మేకప్ చేయించుకోడానికంటూ బ్యూటీపార్లర్ కి వచ్చారు. ఒకరు ఐబ్రోస్, మరొకరు ఫేషియల్, ఇంకొకరు హెయిర్ ట్రీట్ మెంట్.. ఇలా రకరకాల పనులకంటూ ఒకేసారి వచ్చారు. ఒకరికొకరు పరిచయం లేనట్టే నటించారు. హఠాత్తుగా మేకప్ చేసే సమయంలో బ్యూటీపార్లర్ యజమానిపై దాడి చేసి నగలు, నగదు తీసుకుని పారిపోయారు. ఈ కేసుని ఒంగోలు పోలీసులు ఛేదించారు. నలుగురు మహిళలను అరెస్ట్ చేసి వారి వద్ద సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 24గంటల వ్యవధిలోనే కిలేడీలను అరెస్ట్ చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. 


అసలేం జరిగింది..?
ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు మహాలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీకృష్ణ నగర్‌ లో రజియా అనే మహిళ బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తుతెలియని మహిళలు బ్యూటీపార్లర్‌ కు వచ్చి తమకు మేకప్ చేయాలని అడిగారు. కాసేపు మేకప్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఓ మహిళ బాత్రూమ్ కి వెళ్లింది. ఈలోగా మిగతా వాళ్లు తమ స్కెచ్ అమలు చేశారు. బాత్రూమ్ నుంచి వచ్చిన మహిళ నేరుగా బ్యూటీషియన్ మొహంపై యాసిడ్ పోసింది. మిగతా వాళ్లు ఆమెపై మత్తుమందు చల్లారు. బ్యూటీపార్లర్ లో ఉంచిన నగదు దొంగతనం చేశారు. ఇల్లు, పార్లల్ ఒకే చోట ఉండటంతో.. ఇంట్లోకి ప్రవేశించి నగలు కూడా కాజేశారు. 20 సవర్ల బంగారం, కౌంటర్‌ లో ఉన్న రూ. 40 వేల నగదు తీసుకుని ముగ్గురు మహిళలు పరారయ్యారు.




సీసీ టీవీ ఫుటేజీతో వేట..
బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు రజియా సుల్తానాపై క్లోరోఫామ్ చల్లడంతో ఆమె నిద్రమత్తులోకి వెళ్లారు. ఈలోగా దొంగతనం చేసి పారిపోయారు మహిళలు. ఆమె మత్తునుంచి తేరుకుని చుట్టుపక్కలవారికి విషయం తెలిపింది. వారు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఆ ముగ్గురు, ఆమెకు సహకరించిన మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 


ముగ్గురు కాదు నలుగురు..
దొంగతనం చేసిన సమయంలో ముగ్గురు మహిళలు బ్యూటీ పార్లల్ లోకి ప్రవేశించారు. అయితే మరో మహిళ వారికి సాయం చేసింది. బ్యూటీపార్లల్ కింద వేచి చూస్తూ వారికి ఫోన్లో ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది. దొంగతనం పూర్తవగానే అందరూ కలసి పారిపోవడానికి సాయం చేసింది. కేసులోని అన్ని కోణాలు పరిశీలించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.40వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ప్రెస్ మీట్ లో వివరాలు తెలియజేశారు. 


ముండ్రు లక్ష్మీ నవత అలియాస్‌ నవ్య, కరణం మోహన దీప్తి అలియాస్‌ దీప్తి, అళహరి అపర్ణ, దాసరి భాను అలియాస్‌ షాహెరా భాను అనే
నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టపగలే దొంగలు ధైర్యంగా ఈ దోపిడీకి పాల్పడ్డారు, వారి ప్లాన్ అమలైనా చివరకు కటకటాల పాలయ్యారు. ఈ నలుగురు నిందితుల్లో ముండ్రు నవ్య, కరణం దీప్తి, మరో ఇద్దరు యువకులపై పాత కేసులు ఉన్నాయి. ఓ పార్టుమెంటులో వృద్ధురాలిని నిర్భంధించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న కేసులో వారు పాత నేరస్థులు. ఒంటరి మహిళలు, వృద్ధులను గుర్తించి, వారిని బెదిరించి నగలు, నగదు దోచుకోవడం వీరి పనిగా పోలీసులు పేర్కొన్నారు.