నెల్లూరులో వీఆర్వో ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. గుర్తు తెలియని ద్రావణం తాగి వీఆర్వో మురళీకృష్ణ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 




కారణం ఏంటి..?
నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రమౌళి నగర్ ప్రాంతానికి చెందిన సచివాలయ ఉద్యోగి వీఆర్వో మురళీకృష్ణ ఆత్మహత్యాయత్నం జిల్లాలో కలకలం రేపింది. ఆయన ఆత్మహత్యకు కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు అధికారులు. ఇటీవల కొన్నిరోజులుగా పని ఒత్తిడి ఎక్కువైందంటూ మురళీ కృష్ణ సన్నిహితులు, తోటి సచివాలయ ఉద్యోగుల వద్ద చెప్పారని అంటున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేనని కూడా చాలాసార్లు తమ వద్ద బాధపడ్డాడని సన్నిహితులు చెబుతున్నారు. పని ఒత్తిడి వల్లే వీఆర్వో ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది. 


నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లారు. అటు వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. ఈ దశలో కార్పొరేటర్లు టీడీపీ వాళ్లు ఉంటే.. ఆయా ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందనేది కాదనలేని వాస్తవం. ఇటు అధికార పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. వీటికి తోడు అధికారుల ఒత్తిడి అదనం. దొంగఓట్ల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడంతో ఓటర్ల లిస్ట్ ల విషయంలో అధికారులు కూడా నిక్కచ్చిగా ఉంటున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని అంటున్నారు. మురళీకృష్ణ ఆత్మహత్యాయత్నానికి అది కూడా ఓ కారణమా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం నెల్లూరు నగరంలో కలకలం రేపింది. మిగతా ఉద్యోగులు ఆస్పత్రి వద్దకు పరుగు పరుగున వచ్చారు. 


వాలంటీర్ ఆత్మహత్య..
నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని చెర్లోపాళెం గ్రామ వాలంటీరు కరుణాకర్‌ అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి వయసు 35 ఏళ్లు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకర్‌ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం అల్లూరు మండల పరిధిలోని రాయపేటలోని అత్తవారింటికి వెళ్లిన కరుణాకర్ భార్య, పిల్లలను అక్కడే ఉంచి, ఒక్కడే తిరిగి ఇంటికొచ్చాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ కు ఉరివేసుకున్నాడు. స్థానికులు గుర్తించి నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. దారిలోనే 108 వాహనం ఎదురొచ్చింది. 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే చనిపోయాడని నిర్థారించారు. దీంతో మృతదేహాన్ని చెర్లోపాలెం తీసుకెళ్లారు స్థానికులు. కామెర్ల వ్యాధి ముదరడంతో, వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో కరుణాకర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. 




గుండెపోటుతో మరో వాలంటీర్..
బోగోలు మండలం ఉమామహాశ్వరపురం గ్రామ వాలంటీర్‌ పాడేటి రమేష్‌ గుండెపోటుతో మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోడానికి బయటకు వెళ్లిన రమేష్‌ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలి పోయాడు. స్థానికులు వెంటనే 108కి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.