ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న కేటీఆర్, నిన్న హరీశ్ రావు, నేడు ఎర్రబెల్లి దయాకర రావు...ఒకరి తర్వాత ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలోని విద్యుత్ కోతలు, భూముల ధరలపై మంత్రి ఎరబెల్లి దయాకరరావు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ వస్తే...కరెంట్ ఉండదని గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి...అసెంబ్లీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఏపీలో మాత్రం కరెంట్ లేక బట్టలు ఆరేసుకుంటున్నారని అన్నారు.  తెలంగాణలో భూముల ధరలు పెరిగితే.. ఆంధ్రప్రేదశ్ లో మాత్రం భారీగా పడిపోయాయని ఆరోపించారు.


వరంగల్ జిల్లా సంగం మండలంలో రూ.26 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఏపీలో వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చనన్నారు ఎర్రబెల్లి. కేసీఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలమైందని, కరెంట్, నీటి సమస్య తీరిందని...కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలంతా అండగా ఉండాలని సూచించారు. దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభివృద్ది చేసింది ఏమీ లేదని, వాళ్లు చేసిన పాపాలను కడుక్కోవడానికి సరిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ లేదన్న ఎర్రబెల్లి...ఆ పార్టీ నేతలకు బుద్ది లేదన్నారు. బీజేపీ బోగస్ పార్టీగా మారిపోయిందని ఎర్రబెల్లి...రాష్ట్రంలో ఆ పార్టీ సీట్లు గెలిచే అవకాశమే లేదన్నారు. 


గతంలో హరీష్‌రావు కూడా ఏపీలో విద్యుత్ కోతలపై విమర్శలు చేశారు. ఏపీలో ఆరు గంట‌ల పాటు క‌రెంట్ కోత‌లున్నాయ‌ని, తెలంగాణ‌లో రెప్ప‌పాటు పవర్ పోవడం లేదన్నారు మంత్రి హరీశ్ రావు. ప‌క్క‌న వున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజూ ఆరు గంట‌ల పాటు క‌రెంట్ క‌ట్ చేస్తున్నారని...ఉదయం 3 గంట‌లు, సాయంత్రం 3 గంట‌లు క‌రెంట్ పోతోందని గుర్తు చేశారు. అటు ప‌క్క‌న చ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ రోజూ ఆరు గంట‌ల క‌రెంట్ కోత అమలవుతోందని మంత్రి చెప్పారు. దేశం మొత్తం క‌రెంట్ కోత‌లున్న‌ాయని.. పవర్ కట్ లేకుండా 24 గంట‌ల పాటు విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని హరీశ్ రావు పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలే లేవని ప్రభుత్వం చెబుతోంది. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుందని, రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్‌ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లు ప్రతి యూనిట్‌ కు రూ  9.10 వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 


 అన్నిరంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసినట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. ఈనెల ఒకటో తేదీన డిమాండు  సరఫరా మధ్య స్వల్ప అంతరం ఏర్పడిన సమయంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్‌ సరఫరా తగ్గించి గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డిస్కంలు స్పష్టం చేశాయి. ఆదివారం మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ సరఫరాలో ఏ విధమైన  అంతరాయాలు కానీ లోడ్‌ షెడ్డింగ్‌ కానీ లేదని స్పష్టం చేశారు. 


సెప్టెంబర్‌ 1వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్‌ డిమాండ్‌ – సరఫరా  పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిమేర విద్యుత్‌ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేసినట్లు పేర్కొన్నాయి. వ్యవసాయ, గృహ వినియోగ రంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని  విద్యుత్‌ సంస్థలు భావించినట్లుగా తెలిపారు.


ఇందులో భాగంగానే డిమాండు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంత మేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేస్తామని  విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ కు డిస్కింలు తమ అభ్యర్ధన పంపాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థల అభ్యర్ధన  మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి సెప్టెంబర్ 2న ఈనెల 5 వ తేదీ నుంచి  రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి  స్వల్పంగా  విద్యుత్‌ వాడకంలో పరిమితులు విధించవచ్చని  ఆదేశాలు ఇచ్చారు.