నెల్లూరు జిల్లాలో 2020తో పోల్చి చూస్తే 2021లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఏడాది క్రైమ్ రివ్యూ సందర్భంగా నేరాల సంఖ్య తగ్గినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. 2020లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7,897 నేరాలు నమోదవగా.. 2021లో వాటి సంఖ్య 7,513కి తగ్గింది. జిల్లాలో క్రైమ్ రేట్ 5 శాతం మేర తగ్గింది. అంతకు ముందు ఏడాది 2019తో పోల్చుకుంటే 11 శాతం వరకు నేరాల శాతం తగ్గుముఖం పట్టిందని ఇది సంతోషించదగ్గ పరిణామం అని ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో...
ఇక నెల్లూరు జిల్లాలో ప్రతి సోమవారం పోలీసులు నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమంలో 2021లో మొత్తం 1566 పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిలో 266 ఎఫ్‌ఐఆర్ లుగా నమోదు చేశారు. 92 శాతం అర్జీలను వారం రోజుల్లోగా పరిష్కరించగలిగామని ఎస్పీ తెలిపారు. దిశయాప్ డౌన్లోడ్ చేయడంలో కూడా జిల్లా రికార్డ్ స్థాయిలో ఫలితాలు సాధించిందని చెప్పారు ఎస్పీ. జిల్లా వ్యాప్తంగా 11,08,338 దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోగా, దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. అయితే దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నవారిలో ఎక్కువమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, వాటిపై కూడా దృష్టిపెడతామన్నారు.
Also Read: గులాబీకి పూలు - రాళ్లు కూడా .. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన 2021
అయితే జిల్లా వ్యాప్తంగా 2020తో పోల్చి చూస్తే 2021లో హత్యలు, దాడులు, రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. మహిళలపై దాడుల కేసుల్లో కూడా పెరుగుదల ఉంది. కొన్ని కఠినమైన కేసుల్ని వెంటనే పరిష్కరించడం, ఇటీవల కిడ్నాప్ కి గురైన చిన్నారులను గంటల వ్యవధిలో రక్షించగలగడం పోలీసుల ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. నెల్లూరు జిల్లాలో వరదల సమయంలో కూడా పోలీసుల సేవని అందరూ ప్రశంసించారు. నెల్లూరు జిల్లాలో 2021లో 9 జీరో ఎఫ్‌ఐఆర్ లు నమోదవడం విశేషం. 2021లో నెల్లూరు జిల్లాలో మొత్తం 93 మంది సిబ్బందికి పదోన్నతులు వచ్చాయి. విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు కూడా పోలీస్ శాఖ తక్షణ పరిహారం అందించింది.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
ఇక ప్రధానంగా ప్రస్తావించదగ్గ కేసుల్లో.. నెల్లూరు చిన్న బజారు పోలీసు స్టేషన్ పరిధిలో రూ.1.26 కోట్ల దొంగతనం, రూ. 50 లక్షలతో దర్గామిట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ విద్యా సంస్థ ఆడిటర్ నగదుతో ఉడాయించిన కేసులున్నాయి. ఆయా కేసుల్లో నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసి సొత్తు రికవరీ చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. గూడూరు రూరల్ పరిధిలో సెల్ ఫోన్ చోరీ ముఠాను పట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తమ్మీద నెల్లూరు జిల్లాలో 2020తో పోల్చి చూస్తే 2021లో కేసుల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. గత రెండేళ్లతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య 11శాతం తగ్గడంతో ఇదే స్ఫూర్తితో పని చేస్తామని పోలీసులు నమ్మకంగా ఉన్నారు.
Also Read: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!