నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను ఇంటినుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. ఆయన అనుచరుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు, ఎవర్నీ బయటకు రానివ్వడంలేదు.
ఈరోజు ఎమ్మెల్యే కోటంరెడ్డి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నెల్లూరులోని చర్చిల వద్ద ఒక్కో ఇటుక సేకరించి తెచ్చారు. వాటితో పనులు మొదలు పెడతామన్నారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన స్థలంలో నిరసన తెలిపే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. గతంలో కూడా పొట్టేపాలెం కలుజు వద్ద నిరసనకు వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను అడ్డుకున్నారు.
నెల్లూరు నగరంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 18 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టి మరీ ఆయన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పోస్ట్ కార్డ్ లతో ప్రభుత్వానికి విన్నపాలు పంపించారు, ఆ తర్వాత మెసేజ్ లు, వాట్సప్ మెసేజ్ ల ద్వారా సమస్య తీవ్రతను వారి దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తానే స్వయంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామంటూ ముందుకొచ్చారు. చర్చిలనుంచి ఇటుకలను సేకరించారు.. పనులు మొదలు పెట్టేందుకు ఆయన ఈరోజు ఉదయం గాంధీ నగర్ ప్రాంతానికి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు.
అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్పారు. తనను అరెస్ట్ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గత నాలుగేళ్లలో 2019లో ఒకసారి, 2021లో ఒకసారి, 2022లో ఒకసారి, స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం 3 సార్లు సంతకాలు చేయించానని, అయినా పని కాలేదని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
సాక్షాత్తూ సీఎం మూడు సార్లు సంతకాలు చేసినా అతీగతీ లేదని సెటైర్లు వేశారు కోటం రెడ్డి. అప్పటి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వేదాయపాళెం, గాంధీ నగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం 150 అంకణాల స్థలాన్ని కూడా కేటాయించేలా చూశామన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా నేడు ప్రజల పక్షాన ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యానని చెప్పుకొచ్చారు. వేల మంది క్రిస్టియన్ సోదరులకు మేలు చేసే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేవలం 6 కోట్లు నిధులు ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటి హాల్ కోసం 6 కోట్లు నిధులు విడుదల చేస్తామని బహిరంగ ప్రకటన చేయకపోతే ప్రతీ చర్చి నుంచి ఒక్కో ఇటుక రాయిని తీసుకువచ్చి, క్రిస్టియన్ సోదరులతో గాంధీ నగర్ లోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలం వద్ద నిరసన తెలియజేస్తామని గతంలో హెచ్చరించారు. అన్నట్టుగానే ప్రతి చర్చినుంచి ఇటుకలను సేకరించారు. సోమవారం సాయంత్రం గాంధీ నగర్ వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు, ఈరోజు ఉదయం గాంధీనగర్ కు వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు తనతోపాటు, తన అనుచరుల ఇళ్లను కూడా చుట్టుముట్టడం సమంజసం కాదంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అరెస్ట్ లతో తమని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నా పనులు కావడంలేదని, అందుకే తాను పార్టీనుంచి బయటకొచ్చానని, ప్రజల తరపున పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.