ప్రకాశం జిల్లాలో వివాహిత రాధ హత్య కేసులో పోలీసులు టెక్నాలజీని బాగా వినియోగించారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితుల్ని పట్టుకోలేకపోయారని, అసలు ఆమె కనిపించడంలేదని ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపణలు వచ్చినా వారు సైలెంట్ గా ఉన్నారు. హత్యకేసు విచారణ ఆలస్యం అయినట్టే కనిపించినా పక్కా ఆధారాలతో హంతకుడి చేతికి బేడీలు వేశారు పోలీసులు. 


గూగుల్ టేకవుట్.. 
ఇటీవల వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా గూగుల్ టేకవుట్ అనే పదం బాగా పాపులర్ అయింది. పులివెందులలో అందరి ఇళ్లు పక్క పక్కనే ఉంటాయని, గూగుల్ టేకవుట్ ని ఎలా నమ్ముతున్నారని వైసీపీ నుంచి కౌంటర్లు కూడా పడ్డాయి. అదే టెక్నాలజీ ఇక్కడ రాధ హత్య కేసులో భర్త మోహన్ రెడ్డిని పట్టించింది. హత్య జరిగిన రోజు తాను కోదాడలోనే ఉన్నానని పోలీసులకు చెప్పాడు మోహన్ రెడ్డి. తన భార్య కనిపించడంలేదనే విషయం తెలిశాక తాను జిల్లెళ్లపాడుకి వచ్చానన్నారు. కానీ అంతకు ముందే మోహన్ రెడ్డి హత్యజరిగిన ప్రదేశంలో ఉన్నాడని గూగుల్ టేకవుట్ పట్టించింది. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. చివరికి హంతకుడు కూడా అతడేనని పసిగట్టారు. 




భార్య మోసం చేసిందనే కోపంతో..
స్నేహితుడికి రూ.80 లక్షలు ఇప్పించిన భార్య తిరిగి తీసుకోలేకపోయింది. దీంతో మోహన్ రెడ్డికి రాధపై అనుమానం పెరిగింది. స్నేహితుడు కాశిరెడ్డి పేరుతో సిమ్ కార్డ్ లు తీసుకుని చాటింగ్ మొదలు పెట్టాడు. రాధకు అనుమానం రాకుండా తానే కాశిరెడ్డి అని నమ్మించి చాటింగ్ చేశాడు. దాదాపు 15రోజులపాటు ఈ తంతు జరిగింది. అప్పటికే కాశిరెడ్డి ఐపీ పెట్టి పరారీలో ఉన్నాడు. అందుకే రాధ కూడా ఫోన్లో మాట్లాడాలనే ఒత్తిడి తేలేదు. అతడు చాటింగ్ చేసినప్పుడు మాత్రమే రిప్లై ఇస్తుండేది. ఈనెల 17 కూడా రాధతో చాటింగ్ చేసి కొంత డబ్బు సమకూరుస్తానని చెప్పి కనిగిరి రప్పించాడు. కానీ అక్కడ తన భర్త కనపడే సరికి రాధకు అనుమానం వచ్చింది. కానీ మాయమాటలతో ఆమెను నమ్మించి కారు ఎక్కించుకుని వెళ్లిన మోహన్ రెడ్డి గ్రామ శివార్లలో హత్య చేసి రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 


ఒక్కడేనా..?
ఈ హత్య మోహన్  రెడ్డి ఒక్కడే చేశాడా..? ఇంకెవరైనా ఇందులో పాల్గొన్నారా అనే అనుమానం పోలీసులకు ఉంది. ప్రస్తుతానికి మోహన్ రెడ్డి ఒక్కడినే అరెస్ట్ చేసారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కేసు వివరాలు వెళ్లడించారు. మోహన్ రెడ్డి ప్లాన్ ఎలా వర్కవుట్ చేసింది కూడా వివరించారు. 


సిమ్ కార్డ్ లు మార్చి..
కాశి రెడ్డి పేరుతో తీసుకున్న సిమ్ కార్డ్ తన సెల్ ఫోన్ లో వేస్తే తాను దొరికిపోతాననే ఉద్దేశంతో మోహన్ రెడ్డి తెలివిగా నాటకాలాడాడు. తన ఫోన్ పనిచేయడం లేదని, తెలివిగా పక్కనే ఉన్నవారి ఫోన్లు తీసుకుని అందులో సిమ్ కార్డ్ వేసేవాడు. వారి ఫోన్ నుంచి మెసేజ్ లు పంపేవాడు. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసేవాడు. ఇలా.. ఎక్కడా తాను దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. కానీ టెక్నాలజీయే అతడిని పట్టించింది. హత్య జరిగిన రోజు అతను కోదాడలో లేడు, ప్రకాశం జిల్లాలోనే ఉన్నాడనే విషయం తేలిపోయింది. దీంతో పోలీసులకు మిగతా వివరాలు తేలిగ్గా తెలిసిపోయాయి.