ఏపీ సీఎం జగన్ వరద బాధితుల పరామర్శకోసం మూడు జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటిస్తున్నారు. కడప, చిత్తూరు జిల్లాల తర్వాత ఆయన నెల్లూరుకు వస్తారు. గతంలో ఏరియల్ సర్వే చేపట్టిన జగన్ ఇప్పుడు నేరుగా జనం వద్దకు రాబోతున్నారు. దీంతో అధికారులు హడావిడి పడుతున్నారు. సీఎం జగన్ వస్తే ప్రజలనుంచి స్పందన ఎలా ఉంటుంది, వారినుంచి ఫిర్యాదులేమైనా వస్తాయా, నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందా అనే విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నెల్లూరు జిల్లాలో కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల పరిధిలో సీఎం జగన్ టూర్ ఖరారైంది. దీంతో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ముందుగా జగన్ టూర్ ఖరారైన ప్రాంతానికి వెళ్లి పరిస్థితి అంచనా వేశారు. గతంలో కోవూరు నియోజకవర్గంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి పర్యటన సందర్భంగా కొంత ప్రతిఘటన ఎదురైంది. అయితే అలజడికి కారణం టీడీపీ వర్గమేనని సర్దిచెప్పుకున్నా ప్రజల్లో కూడా వరద సహాయక చర్యలపై కొంత అసంతృప్తి ఉందనేమాట వాస్తవం. సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసే విషయంలో ముందస్తు హెచ్చరికలు లేవని, తమ గ్రామాలు మునిగే వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు కొంతమంది. గతంలో ఎప్పుడూ పెన్నాకు వరదలు వచ్చినా కోవూరు నియోజకవర్గం పెద్దగా ప్రభావితం అయ్యేది కాదు. కానీ ఈ సారి మాత్రం కోవూరు పరిధిలో కూడా చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వరదనీటితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో స్థానికంగా కొంత అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి జగన్ ముందు వ్యక్తం అవుతుందేమోననే భయం నాయకుల్లో ఉంది.
ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి భగత్ సింగ్ నగర్ కాలనీలో సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముందుగానే అక్కడి పరిస్థితి అంచనా వేసి వచ్చారు. బాధితులతో మాట్లాడి, ఎవరికైనా సహాయం అందలేదేమో కనుక్కున్నారు. వారంతా సంతృప్తిగానే ఉన్నట్టు మంత్రికి తెలిపారు. అయితే సీఎం జగన్ వచ్చినప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా వేయలేం. జగన్ ని చూసిన తర్వాత ఎవరైనా తమ అసంతృప్తి బయటపెడితే, స్థానిక నాయకులు, అధికారులపై ఫిర్యాదు చేస్తే.. వాటి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఊహించలేం.
నెల్లూరు జిల్లాలో వరద సహాయక చర్యల పర్యవేక్షణకు జిల్లా ఇన్ చార్జి మంత్రి బాలినేని, జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు కూడా కదలి వెళ్లారు. అప్పట్లో స్థానికులు వరద సాయంపై కొంతమందిని గట్టిగా నిలదీసిన సందర్భాలున్నాయి. అలాంటి పరిస్థితులు ఇప్పుడు పునరావృతం కాకూడదని నాయకులు అనుకుంటున్నారు. అటు అధికారులు కూడా జగన్ పర్యటనపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు.. సీఎం జగన్ పర్యటించే ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్థానికులు వరద సహాయక చర్యలతో సంతృప్తిగా ఉన్నారా, లేదా అనే విషయాలను ఆరా తీశారు. మొత్తమ్మీద జగన్ రాకతో స్థానిక నాయకుల్లో, అధికారుల్లో హడావిడి మొదలైంది. జగన్ ముందు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: Akhanda Twitter Review: ‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అఘోరా ఎంట్రీ చూస్తే పూనకాలేనట!
Also Read: CM Jagan: వరద ప్రభావిత జిల్లాల్లో ఇవాళ, రేపు ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి