ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా భారీ వర్ష సూచన కొనసాగుతోంది. మరో అల్ప పీడనం ఏర్పడనున్నట్లుగా అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు వారు రాగల 3 రోజుల వాతావరణ పరిస్థితుల గురించి ఓ ప్రకటన విడుదల చేశారు.


‘‘నేడు, అండమాన్ సముద్రం పొరుగు ప్రాంతాల మధ్య అల్పపీడన ప్రాంతం ఉంది. ఇది 2 డిసెంబరు నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ మరియు ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. ఇది డిసెంబరు 3 నాటికి తుపానుగా బలపడి వాయువ్య దిశగా కదిలి, మరింత బలపడి డిసెంబరు 4 ఉదయం ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబరు 3వ తేదీన ఏపీ ఉత్తర కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4వ తేదీన ఉత్తర కోస్తాలోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3, 4 డిసెంబరున తీరం వెంబడి 80 నుంచి 90 కిలోమీటర్లు లేదా 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి, ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. డిసెంబరు 3 నుంచి 5 వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. సముద్రంలో ఉన్నవారు డిసెంబరు 2 నాటికి తిరిగి రావాలని సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రైతులు కాపాడుకోవాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేయాలి’’ అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.






తెలంగాణలో ఇలా..
తెలంగాణలో వాతావరణ పరిస్థితుల అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 5 రోజులకు సంబంధించి వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. 2న పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. రాగల 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని వెల్లడించింది.