Nellore To Team India Akhil Success Story: 


క్రికెట్ పై అతనికున్న ఆసక్తి జాతీయ ఆటగాడిగా తీర్చిదిద్దింది. అనుకోని యాక్సిడెంట్ తో శరీరం సహకరించకపోయినా క్రికెట్ ని మాత్రం వదులుకోలేదు అఖిల్ రెడ్డి. కఠోర సాధనతో ఇప్పుడు ఇండియా టీమ్ కి సెలక్ట్ అయ్యాడు. భారత్ తరపున విదేశాల్లో మ్యాచ్ లు ఆడుతున్నాడు. 


భారత క్రికెట్ టీమ్ అంటే అందరికీ పురుషుల టీమ్ గుర్తొస్తుంది. ఇప్పుడిప్పుడే మహిళా క్రికెట్ కి కూడా ప్రాధాన్యత దక్కుతోంది. అయితే వికలాంగుల క్రికెట్ కి కూడా మంచిరోజులొస్తాయంటున్నారు అఖిల్. ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్ లకు వీరికి బీసీసీఐ స్పాన్సర్ చేస్తోంది. వీల్ చైర్ క్రికెట్, డెఫ్ అండ్ డంబ్ ప్లేయర్స్ క్రికెట్, బ్లైండ్ పర్సన్స్ క్రికెట్, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అంటూ నాలుగు రకాలుంటాయి. వీటిలో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ టీమ్ లో అఖిల్ భారత్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 




2011లో ఇంటర్ చదివే సమయంలో అఖిల్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో స్నేహితుడు చనిపోగా అఖిల్ తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు. అయితే చేయి మాత్రం స్వాధీనంలోకి రాలేదు. తండ్రి హరిప్రసాద్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదర్లేదు, ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేదు. చివరకు ఎడమచేయి సహకరించకపోయినా క్రికెట్ ఆడాలని డిసైడ్ అయ్యాడు అఖిల్. 2017నుంచి సాధన మొదలు పెట్టాడు, ఏడాదిలోనే ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారాడు. ఆ తర్వాత ఇప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్ గా నిలిచాడు. 




నెల్లూరులోని ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీలో అఖిల్ శిక్షణ తీసుకుంటున్నాడు. కోచ్ రాజాకృష్ణ సారథ్యంలో నిరంతర సాధన చేస్తుంటాడు అఖిల్. అఖిల్ కష్టపడే మనస్తత్వమే అతడిని ఆ స్థాయిలో నిలబెట్టిందని చెబుతాడు కోచ్ రాజాకృష్ణ. ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీలో ఇప్పటికీ ప్రతి రోజూ ప్రాక్టీస్ చేస్తుంటాడు అఖిల్. మీగత్ ప్లేయర్లకు ధీటుగా ఆడుతుంటాడు. చిన్న పిల్లలకు కూడా అఖిల్ ఇన్స్ పిరేషన్ గా నిలుస్తున్నాడు.  




అఖిల్ కి కుటుంబం సగం బలమైతే, స్నేహితులు మిగతా సగం బలం. అఖిల్ ప్రాక్టీస్ లో వారి పాత్ర చాలా ఎక్కువ. అఖిల్ సొంతగా స్కూటీ నడపగలిగినా.. షూ లేస్ కట్టుకోవడం, ప్యాడింగ్.. వంటి చిన్న చిన్న పనుల్లో మాత్రం స్నేహితుల సహాయం తీసుకుంటాడు. నెల్లూరులో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే శ్రీనివాసులరెడ్డి కూడా అఖిల్ కి చేదోడువాదోడుగా ఉంటారు. ఆయన సపోర్ట్ కూడా అఖిల్ కెరీర్ ని నిలబెట్టింది. నేషనల్స్ కి ఆడేలా చేసింది. 




అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అఖిల్ కి పలు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు, రివార్డులు అందించాయి. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా అఖిల్ గుర్తింపు కోరుకుంటున్నాడు. ఎవరి సాయం లేకుండా ఏం చేయగలడు అనుకున్న కొడుకు, తన సొంత కాళ్లపై తాను నిలబడే స్థాయికి రావడం సంతోషంగా ఉందంటున్నారు అఖిల్ పేరెంట్స్. భవిష్యత్తులో అఖిల్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు. జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అక్కడే ఆగిపోకుండా వాటిని అధిగమించి ముందుకు సాగితేనే విజయాలు సాధించగలం అంటున్నారు, దానికి అఖిల్ జీవితమే ఉదాహరణ అని చెబుతున్నారు.