Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy:


అధికారంలో ఉన్న పార్టీకి దూరం కావాలని సహజంగా ఏ నాయకుడూ అనుకోరు. ఒకవేళ తాము ఉన్న పార్టీ ఓడిపోతుందనుకున్నా.. సరిగ్గా ఎన్నికల టైమ్ లోనే గోడదూకుతారు. కానీ ఏడాదిపాటు అధికారాన్ని వదిలిపెట్టుకుని పార్టీకి దూరం జరిగారు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు. పార్టీ వేటు వేసిందా, వారే బయటొక్చేశారా అనే తర్కం పక్కనపెడితే, పార్టీ దూరం పెడుతోందని తెలిసి వారు టీడీపీ స్టాండ్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చి బయటపడ్డారు. అయితే ఆ నలుగురు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వారి రాజకీయ భవిష్యత్ ఏంటి..? ఆ నలుగురిలో మిగతా ముగ్గురి కంటే ఓ అడుగు ముందున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు కూడా ఆయనలాగా కష్టపడటం లేదనే చెప్పాలి. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు కోటంరెడ్డి. 


వైసీపీనుంచి బయటకొచ్చే విషయంలో కూడా ఆ నలుగురిలో కోటంరెడ్డి స్పీడ్ గా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి దూరం జరిగినా.. ఆయనకంటే ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీపై తిరుగుబాటు చేశారు. బయటకొచ్చేశారు. కొన్నాళ్లు స్వతంత్రంగానే ఉన్నా కూడా చివరకు టీడీపీ అండ ఆయనకు అవసరం అయింది. టీడీపీకి కూడా నెల్లూరు నుంచి కోటంరెడ్డి వంటి లీడర్ కావాల్సి వచ్చింది. ఇక్కడ ఇద్దరి అవసరాలూ తీరాయి, ఇక 2024లో ఎవరి వల్ల ఎవరికి ఉపయోగం ఉందనేదే తేలాల్సి ఉంది. 


కోటంరెడ్డి ఉనికికే సవాల్..
వరుసగా రెండుసార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2014 నుంచి 2019 మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నారు. అయితే అప్పుడు అనుకున్న స్థాయిలో పనులు చేపట్టలేకపోయారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చినా, జగన్ వ్యూహాలతో ఎమ్మెల్యేలకు పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం రాలేదు. బడ్జెట్ అంతా బటన్ నొక్కడానికే సరిపోవడంతో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా పోయింది. పదే పదే అదే విషయాన్ని జిల్లా అభివృద్ధి కమిటీ మీటింగుల్లో ప్రస్తావించేవారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రజలకు మంచి చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. మంత్రి పదవి రాకపోవడం మరో కారణం. అందుకే ఆయన పార్టీనుంచి బయటకొచ్చేశారు. అయితే అలా రావడానికి తన ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కారణం అంటున్నారాయన. ఆ విషయంలో కూడా వైసీపీపై ఆరోపణలు చేశారు, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఆ ఎపిసోడ్ అక్కడితో ఆగిపోయింది. అయితే ఇప్పుడు నెల్లూరు రూరల్ నుంచి ఆయన గెలుపు అనివార్యంగా మారింది. ఈసారి గెలవకపోతే రూరల్ నియోజకవర్గంలో ఆయన రాజకీయంగా బలహీనపడే అవకాశముంది. 


నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి ప్రత్యర్థిగా వైసీపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఇటు కోటంరెడ్డి సోదరులిద్దరూ టీడీపీ కోసం చెమటోడుస్తున్నారు. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ తరపున టికెట్ ఖాయమైంది, అక్కడ ఆయన్నే ఇన్ చార్జ్ గా ప్రకటించారు కూడా. వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చిన మిగతా ఎమ్మెల్యేలలో ఎవరికీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదు. కోటంరెడ్డి మాత్రమే ఆ బాధ్యతలు తీసుకుని పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆమధ్య నారా లోకేష్ పాదయాత్రను కూడా ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో కూడా హుషారుగా పాల్గొంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే ప్లానింగ్ తో వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ హవా ఉంటుందా, లేక స్థానికంగా కోటంరెడ్డి అనుచరగణం బలానికి విజయం వరిస్తుందా.. వేచి చూడాలి.