‘సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడితే చెంప చెల్లుమనిపిస్తా..    దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి రండిరా.. ఒకడు పక్క నియోజకవర్గానికి వెళ్లి  నుంచి కొంతమందిని రెచ్చగొడుతున్నాడు.. ఇంకొకడు పక్క పార్టీలోకి వెళ్లి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు.. పళ్లు రాలగొడతా. నట్లు బోల్టులు వేసినా బోన్స్ సెట్ కాలేని విధంగా కొడతా ’


ఇదీ.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ వాడిన భాష. ఆయనేదో పక్క పార్టీ వాళ్ల గురించి మాట్లాడలేదు. సొంత పార్టీ మనిషి పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కి వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుకి కూడా వెంకటేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరినీ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. 


ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇక్కడ ఆమంచి, కరణం ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి. పొరపాటున నోరుజారి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కమ్మ వర్గంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఆయన సారీ చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగినా కరణం, ఆమంచి వర్గాల మధ్య మాత్రం గొడవలు మరింత ముదిరాయి. ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు, జనసేన నేత ఆమంచి స్వాములు కూడా ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా వెంకటేష్.. వైఎస్ఆర్ వర్థంతి రోజున ఘాటు విమర్శలు చేశారు. దీంతో మరోసారి అక్కడ వాతావరణం వేడెక్కింది. 


చీరాల నియోజకవర్గం ఆమంచి ఫ్యామిలీకి కంచుకోటలా ఉండేది. 2014లో స్వతంత్రంగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్, తర్వాత టీడీపీలో చేరి, 2019 ఎన్నికల సమయానికి వైసీపీనుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో టీడీపీనుంచి చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో ఒకే ఒరలో రెండు కత్తులు అన్నట్టుగా మారింది పరిస్థితి. బలరాం చేరికతో వైసీపీ ఇన్ చార్జ్ గా కూడా ఆమంచికి న్యాయం జరగలేదు. ఆయన్ను పక్క నియోజకవర్గానికి పంపించి వేశారు. దీంతో 2024 చీరాల వైసీపీ టికెట్ కూడా కరణం కుటుంబానికే అనే విషయం ఖాయమైంది. ఈ దశలో సొంత నియోజకవర్గంలో పట్టుకోసం ఆమంచి కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఇటీవల జనసేనలో చేరారు. ఆయన చీరాల లేదా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుటుంబంపై స్వాములు ఘాటు విమర్శలు చేశారు. దీంతో అటువైపు నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. 


నేనే పోటీ చేస్తా..
2024లో చీరాలనుంచి తానే బరిలో ఉంటానంటున్నారు బలరాం తనయుడు కరణం వెంకటేష్. ఎవరొస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. గతంలో కంటే మరింత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ మాస్ వార్నింగ్ కి ఆమంచి కుటుంబం నుంచి కానీ, లేదా వారి అనుచరులనుంచి కానీ ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.