Nellore Collectorate Power Cut Problems: ఇల్లయినా, ఆఫీస్ అయినా కరెంటు పోవడం, రావడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ కాసేపు కరెంటు పోతే ఎవ్వరూ తట్టుకోలేని పరిస్థితి, అందుకే అందరి ఇళ్లలో ఇన్వర్టర్లు ఉంటాయి. అదే ఆఫీసులలో అయితే కచ్చితంగా జనరేటర్లు ఉండాల్సిందే. కంప్యూటర్లతో పనిజరిగే ఆఫీస్ లలో యూపీఎస్ లు, లేదా ఇన్వర్టర్లు తప్పనిసరి. కానీ నెల్లూరు కలెక్టరేట్ కి మాత్రం ఇన్వర్టర్ సదుపాయం లేదు. కరెంటు పోతే కలెక్టరేట్ లో కంప్యూటర్లన్నీ ఆగిపోతాయి. ఫ్యాన్లు, లైట్లు లేకపోయినా పర్లేదు.. పనిచేసుకునే కంప్యూటర్లు అర్థాంతరంగా ఆగిపోతే సిబ్బంది ఏం చేస్తారు చెప్పండి. అప్పటి వరకూ ఎంట్రీ చేసిన డేటా సేవ్ కాకపోయినా, ఎరేజ్ అయిపోయినా చేయడానికేంలేదు. తరచూ కరెంటు సమస్యల వల్ల కంప్యూటర్లు ఆగిపోతే రిపేరింగ్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఉన్నతాధికారులు మాత్రం దీన్ని పట్టించుకోవడంలేదు. 


ఒకటీ అరా కంప్యూటర్లు ఉండే చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలోనే యూపీఎస్ లు, ఇన్వర్టర్లు ఉంటాయి. అలాంటిది వందలాది కంప్యూటర్లు ఉండే కలెక్టరేట్ లో ఇన్వర్టర్ లేకపోతే పరిస్థితి ఏంటి..? గతంలో ఇక్కడ ఇంతియాజ్ అహ్మద్ జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు కొన్ని కంప్యూటర్లకు యూపీఎస్ సదుపాయం కల్పించారు. వాటిలో కూడా కొన్ని ఇప్పుడు పనిచేయడంలేదు. మిగతా వాటి సంగతి సరే సరి. 


నిధులు లేవా..? నిర్లక్ష్యమా..?
ఓవైపు కొత్త జిల్లాల ఏర్పాట్లు, కొత్త కలెక్టరేట్ల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాలకోసం ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెడుతోంది. ఇటు పాత జిల్లాల్లో మాత్రం ఇలాంటి సమస్యలు ఉద్యోగులకు చుక్కలు చూపెడుతూనే ఉన్నాయి. పోనీ ఇన్వర్టర్ల కొనుగోలు భారీ ఖర్చుతో కూడుకున్న పనా అంటే అదీ లేదు. ఇటీవలే అట్టహాసంగా నెల్లూరు జిల్లాలో రెవన్యూ స్పోర్ట్స్ జరిగాయి. అలాంటి కార్యక్రమాల హంగామాను ఎవరూ కాదనలేరు కానీ, కనీసం కలెక్టరేట్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా. పోనీ ఇక్కడ ఇన్వర్టర్ తో ఉద్యోగులకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇన్వర్టర్ సౌకర్యం ఉంటే కంప్యూటర్లు త్వరగా రిపేర్ కి రావు. అప్పటి వరకూ చేసిన పని అర్థాంతరంగా ఆగిపోదు. అదీ వారు కోరుతున్నది. 


జనరేటర్ ఉంది.. కానీ..!
కలెక్టరేట్ లో కరెంటు పోతే జనరేటర్ ఉంది. కానీ దానివల్ల ఉపయోగం ఏమాత్రం లేదు. కరెంటు పోతే కంప్యూటర్లు ఆగిపోతాయి, ఆ తర్వాత జనరేటర్ వేస్తారు. అందులోనూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థాయి ఉద్యోగులు ఆఫీస్ కి వస్తే వెంటనే జనరేటర్లు ఆన్ అవుతాయి, లేకపోతే అదీ లేదు. కరెంటు పోయి జనరేటర్ ఆన్ చేసినా కంప్యూటర్లు మాత్రం ఆగిపోతాయి. పోనీ ఆ తర్వాత కరెంటు వచ్చినా సిస్టమ్స్ షట్ డౌన్ చేసుకోండి అనే సిగ్నల్ కూడా ఇవ్వరు. వెంటనే జనరేటర్ ఆఫ్ అయిపోయి కరెంటు సరఫరా చేస్తారు. ఇది మరో సమస్య. అప్పుడు కూడా కంప్యూటర్లు అర్థాంతరంగా ఆగిపోతాయి. 


కలెక్టర్ కి చెప్పేదెవరు..?
ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి సమర్థుడైన పాలనాధికారిగా పేరుంది. ఆయన హయాంలో కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ల కోసం తిక్కన ప్రాంగణాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గాంధీ విగ్రహం, అతిపెద్ద జాతీయ జెండా అన్నీ ఏర్పాటయ్యాయి. ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్తే పరిష్కరిస్తారని అంటున్నారు కానీ, సిబ్బందిలో ఆచొరవ చూపేవారేరి. కొత్త జిల్లాల  ఏర్పాటుతో ఏపీ సంబరాలు చేసుకుంటున్న దశలో అయినా, పాత కలెక్టరేట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన సాకారం అవుతుందా..? వేచి చూడాలి.