నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇది జరిగింది. వైఎస్ఆర్ సీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెచ్చుకున్నారు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆయన కుటుంబం నుంచే ఒకరికి వైఎస్ఆర్ సీపీ టికెట్‌ను ఖరారు చేసింది. మేకపాటి విక్రమ్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంతో ఆయనకు మద్దతుగా ఆ పార్టీ నేతలు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


సంగం మండలం జంగాల కండ్రిక గ్రామంలో మేకపాటి విక్రమ్‌ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే పదవీ కాలం మధ్యలో మృతి చెంది ఉప ఎన్నికల్లో ఆ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే, అక్కడ పోటీ పెట్టకూడదని టీడీపీ ఒక నియమం పెట్టుకుని అమలు చేస్తోందని అన్నారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే మేకపాటి గౌతమ్‌ రెడ్డి చనిపోయినప్పుడు బీజేపీ నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపి ఇప్పుడు పోటీకి దిగడం దారుణమని అన్నారు. 


అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ అదే రోడ్ షోలో చంద్రబాబు గురించి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి చెప్పిన మాటలను తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. టీడీపీ అభ్యర్థిని నిలపక పోయినా, ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా అన్ని రకాల కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆయన పెద్ద వెన్నుపోటు దారుడని వ్యాఖ్యలు చేశారు. సంగం మండలంలో 2019లో 2 వేల ఆధిక్యం మాత్రమే వైసీపీకి లభించిందని, ప్రస్తుతం 20 వేలకు పెంచేందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించారని అన్నారు.


ఆత్మకూరు ఎన్నికలకు వైసీపీ దూరం
ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండలని టీడీపీ జూన్ 2న ప్రకటించింది. గుండె పోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న మేకపాటి గౌతమ్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని ఈ స్థానం నుండి పోటీకి నిలపాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించింది. గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని బరిలోకి దింపినందున ఈ స్థానంలో పోటీ చేయడం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు.