ప్రకాశం జిల్లాలో ఓ నేత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు
ఎర్రగొండపాలెంలోని ఆయన నివాసంలో సీసీఎస్ సోదాలు
ఖరీదైన విగ్రహాన్ని గుర్తించిన ఒంగోలు సీసీఎస్ అధికారులు 
తాను అనుమతి తీసుకున్నానని వివరణ ఇచ్చిన నేత, కానీ !
Emerald Ganesh Idol: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇళ్లల్లో సీసీఎస్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అత్యంత ఖరీదైన విగ్రహాన్ని వైసీపీ నేత ఇంట్లో గుర్తించారు. అయితే చివర్లో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి. 


ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నేత ఇంట్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భాగంగా వైసీపీ నేత ఇంట్లో ఓ అత్యంత ఖరీదైన మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహం విలువ కోట్ల రూపాయలు ఉంటుందని సీసీఎస్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఖరీదైన విగ్రహం రహస్యంగా ఇంట్లో దాచిన కేసులో నేతను, ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే అనుమానంలో గ్రామ నేత గజ్జెల చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.


ఉత్తర్వుల  కాపీలు తీసుకురండి..
ఖరీదైన మరకత పంచముఖ వినాయక విగ్రహం ఇంట్లో ఉండటంపై సీసీఎస్ పోలీసులకు ఆ నేత వివరణ ఇచ్చుకున్నారు. ఆ విగ్రహం తమ వద్ద ఉంచుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని సీసీఎస్ పోలీసులకు తెలిపారు. అదే నిజమైతే, అందుకు సంబంధించిన అనుమతి ఉత్తర్వు కాపీలను తమకు చూపించాలని సూచించి, వారిని విడిచిపెట్టారు. ఈ ఖరీదైన విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఉన్నతస్థాయి నేతల నుంచి ఒత్తిడి రావడంతో విగ్రహాన్ని వారి వద్ద ఉంచుకొని.. పోలీసులు నిందితులను వదిలేసినట్లు తెలుస్తోంది. ఓ పంచాయతీ కార్యదర్శి హస్తం ఉందని, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. 


కేసు నమోదు చేసిన పోలీసులు.. త్వరలో తేలనున్న మిస్టరీ
విగ్రహం రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుల వెడల్పు దాదాపు 90 కిలోల బరువు ఉన్నట్లు సమాచారం. సాధారణంగా నల్లమల అటవీ ప్రాంతం, ఆలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, విగ్రహం లభించిందనే సమాచారంతో ఒంగోలు పోలీసులు రంగంలోకి దిగారు. విగ్రహాన్ని కొనేందుకు వెళ్తున్న వ్యక్తుల్లా వెళ్లిన పోలీసులు విక్రేతల నుంచి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక అధికార పార్టీ నేత ఉన్నారని సమాచారం. అక్కడే పంచాయతీ కార్యదర్శిగా చేసే వ్యక్తి, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అతని అల్లుడు ఈ విగ్రహం విక్రయించాలని తమకు చెప్పారని పోలీసులు పట్టుకున్న వ్యక్తులు చెప్పారు. చివరగా ఈ విషయంపై ఎర్రగొండపాలెం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. విగ్రహం స్వాధీనం చేసుకున్న ఇంటి యాజమానికి సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చామని ఎస్సై కోటయ్య తెలిపారు. విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


Also Read: Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ కేసు: వారం క్రితమే ప్లాన్, నొప్పి లేకుండా ఎలా అని శోధన - విచారణలో కీలక విషయాలు


Also Read: Nellore Suicides: రైల్వే ట్రాక్‌పై యువతి, యువకుడి మృతదేహాలు - మిస్టరీగా మారిన డెత్స్, వీరిద్దరికీ పరిచయముందా?