నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ (ఐఏబీ) సమావేశం వాడివేడిగా సాగింది. గతంలో కూడా ఐఏబీ మీటింగ్ లో తనదైన శైలిలో ప్రశ్నలు సంధించిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి కూడా అధికారుల తీరుని తూర్పారబట్టారు. ముఖ్యమంత్రికే తప్పుడు సమాచారం ఇస్తారా అని ప్రశ్నించారు. అసలు తప్పు పాలకులు చేశారా, అధికారులు చేశారా, ప్రజా ప్రతినిధులు చేశారా..  అని నిలదీశారు. 


నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు ప్రధాన ప్రాజెక్ట్ లు సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా వరదల సమయంలో పరామర్శకు వచ్చిన సీఎం జగన్ సంక్రాంతి పండగ తర్వాత వాటిని ప్రారంభిస్తానన్నారు. సంక్రాంతి పోయింది, ఆ తర్వాత జిల్లా మంత్రి గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మళ్లీ సంగం బ్యారేజి వార్తల్లోకెక్కింది. ఈ బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడతామన్నారు సీఎం జగన్. మూడు వారాల్లో బ్యారేజీ ప్రారంభిస్తామన్నారు. ఆ గడవు కూడా పూర్తయింది. తాజాగా మే నెలలో ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితి చూస్తే, ఆ మహూర్తం కూడా కుదిరేలా లేదు. దీనిపై ఎమ్మెల్యే ఆనం ఐఏబీ మీటింగ్ లో నిలదీశారు. అసలు బ్యారేజ్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పండని అధికారుల్ని నిలదీశారు. స్వర్ణ ముఖి బ్యారేజీకి దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలన్నారు. 


వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి చెరువు పనులకోసం 20కోట్ల రూపాయల నిధులకోసం గతంలో ప్రతిపాదనలు పెట్టారు. ఈ సారి సమావేశంలో కూడా 20కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు ఉంచారు. అయితే గతంలో నిధులు విడుదల కాకుండా మరోసారి 20కోట్ల ప్రతిపాదనలేంటి అని అడిగారు రామనారాయణ రెడ్డి. కనీసం ఈసారయినా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించడమే కానీ, నిధుల కేటాయింపు జరగడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 


ఇంతకీ బ్యారేజీలకు మోక్షం ఎప్పుడు..?
గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు పూర్తి కావాల్సి ఉంది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కూడా పనులు పూర్తి చేస్తామంటూ గడువులు విధించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పలు డెడ్ లైన్లు పెట్టారు. కానీ పనులు ముందుకు సాగలేదు, బ్యారేజీల ప్రారంభోత్సవాలు జరగలేదు. అయితే ఇటీవల గౌతమ్ రెడ్డి మరణం తర్వాత సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై జీవో కూడా విడుదలైంది. అయితే బ్యారేజీ ప్రారంభోత్సవం ఎప్పుడనేది తేలడంలేదు. ఇప్పటికే మూడు సార్లు సీఎం జగన్ మూడు మహూర్తాలు పెట్టారు. కానీ అవి సాధ్యం కాలేదు. ఈసారయినా సీఎంకు సరైన సమాచారం ఇవ్వండి అంటూ ఆనం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.