Nellore News : సునీల్ కు నాలుగో తరగతి చదువుతుండగా కరెంట్ షాక్ తో రెండు చేతులు, ఒక కాలు తొలగించాల్సి వచ్చింది. అవయవాలు దూరమయ్యాయి కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అతడి నుంచి ఎవరూ తీసుకెళ్లలేకపోయారు. చేతులు కోల్పోయినా అతడిలో పట్టుదల సడలలేదు. పైగా తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితులిచ్చిన ధైర్యం. అతడిని ఇంతవాడిని చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. ఇలా చదువులో రాణించి ఉద్యోగం తెచ్చుకున్న దివ్యాంగులను చాలామందినే చూసి ఉంటాం. అక్కడితో ఆగిపోతే సునీల్ ఆ ఏరియాలో హీరో అయ్యేవాడు కాదు. చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన క్రికెట్ ని ఆరాధించాడు, ప్రేమించాడు, ఆటతోనే తనలోని వైకల్యాన్ని జయించాడు. స్పోర్టివ్ స్పిరిట్ ని నిజ జీవితంలో కూడా అలవాటు చేసుకున్నాడు. 



ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ 


చేతికి బ్యాట్ ని టవల్ తో బిగించి కట్టాడంటే మనోడు సిక్సర్లు బాదేస్తాడు. కాకుటూరు టీమ్ కి కెప్టెన్ కూడా సునీలే. నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ టోర్నమెంట్ జరిగినా కాకుటూరు టీమ్ బరిలో దిగాల్సిందే. సునీల్ ని ఒక వికలాంగుడిలా కాకుండా తమతోటి మనిషిగా తమ జట్టులో చేర్చుకోవడం, ఓపికగా అతడితో కలసి ఆడటం. ఇవన్నీ చూస్తుంటే ఆ టీమ్ మేట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వారిచ్చిన ప్రోత్సాహం వల్లే తనకున్న వైకల్యాన్ని మరచిపోయి తాను బయటకొచ్చి ఇలా క్రికెట్ ఆడగలుగుతున్నానని చెబుతాడు సునీల్. సునీల్ ని తామెప్పుడూ వికలాంగుడిగా చూడలేదని, ఆయన కూడా అలా ఆత్మన్యూనతకు లోనుకాలేదని, తమలో ఒకడిగా ఉన్నాడని, క్రికెట్ అంటే సునీల్ కి ఆసక్తి ఉందని చెబుతున్నారు. క్రికెటర్ గా సునీల్ ప్రతిభ జిల్లాలో చాలామంది ప్లేయర్స్ కి తెలుసని అంటున్నారు. ఆత్మవిశ్వాసంతో సునీల్ తాను అనుకున్నది సాధించాడని, ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ గా ఉన్నా కూడా క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని వదులుకోలేదని చెబుతున్నారు. 



కుటుంబానికే ఆధారం 


ఇక సునీల్ ని చూసి కుటుంబం కూడా సంతోషంతో పొంగిపోతోంది. తన కొడుకు భారం అవుతాడని భావించిన తండ్రి కుటుంబానికే కొడుకు అండగా ఉండటం చూసి ఆనందిస్తున్నారు. చిన్నప్పుడు చేతులు లేకపోయినా సైకిల్ తొక్కిన సునీల్, ఇప్పుడు బైక్ కూడా నడుపుతారు. తన పనులన్నీ తానే చేసుకుంటారు. చక్కటి హ్యాండ్ రైటింగ్ సునీల్ సొంతం. తల దువ్వుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, మొబైల్ ఫోన్ ని కూడా తనే ఆపరేట్ చేస్తారు. రెండు చేతులు, ఒక కాలు లేకపోయినా ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తున్నారు. మనసెరిగిన అర్థాంగి రత్న సునీల్ కు ఇప్పుడు తోడయ్యారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోపాటు, సునీల్ లో ఉన్న ఆత్మ విశ్వాసమే అతడిని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెబుతున్నారు తండ్రి .