Minister Mekapati Goutham Reddy last Rights: హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) అంత్యక్రియలు ముగిశాయి. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఆయన్ను దహనం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి చివరి క్రతువును పూర్తి చేసి.. తండ్రి చితికి నిప్పంటించారు. ఆ సమయంలో మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులు, మంత్రులు, వైసీపీ నేతలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరిపించింది. అంత్యక్రియల సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) దంపతులు కూడా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు (Mekapati Goutham Reddy last Rights) హాజరయ్యారు. చివరిసారిగా మంత్రి భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించి తుది వీడ్కోలు పలికారు.


అంత్యక్రియల సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి తల్లి మణిమంజరి విషాదం ఆపుకోలేకపోయారు. కన్న కొడుకును అలాంటి పరిస్థితిలో చూడలేక రోదిస్తూ ఆమె తల్లడిల్లిపోవడం అక్కడున్నవారిని కన్నీరు పెట్టించింది. మంత్రి భార్య శ్రీకీర్తి కూడా తన్నుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. బంధువులు వారిద్దరినీ ఓదార్చే ప్రయత్నం చేశారు.


తొలుత నెల్లూరులోని మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం నుంచి ప్రారంభమైన మంత్రి అంతిమయాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంది. ఈ యాత్రలో ఆయన బంధువులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర పొడవునా ప్రజలు, అభిమానులు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి, కుమార్తె సాయి అనన్య.. తండ్రి గౌతమ్‌ రెడ్డి తరహాలోనే దుస్తులు ధరించారు.