Mekapati Krishna Arjun Reddy: ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, తండ్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణవార్త విని అమెరికా నుంచి బయలుదేరి నెల్లూరుకు వచ్చారు ఆయన కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి. విమానంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగి, అక్కడినుంచి రోడ్డు మార్గాన ఆయన మంగళవారం రాత్రి 11 గంటలకు నెల్లూరు చేరుకున్నారు. నేరుగా ఇంట్లోకి వెళ్లారు. అప్పటి వరకూ ప్రజల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో బయట ఉంచారు. కుమారుడు వస్తున్నాడని తెలిసి, భౌతిక కాయాన్ని మంత్రి చాంబర్ లోకి తీసుకెళ్లి ఉంచారు. 


కృష్ణార్జున్ రెడ్డి వచ్చీ రాగానే నేరుగా లోపలికి వెళ్లారు. తండ్రి పార్థివదేహం ఉంచిన రూమ్ లోకి వెళ్లారు. అక్కడినుంచి అందర్నీ బయటకు వెళ్లాలని చెప్పారు. కుటుంబ సభ్యులు, సహాయకులు ఎవ్వరూ ఆ రూమ్ లోకి వద్దని వారించి బయటకు పంపించేశారు. ఒక్కడే తండ్రి మృతదేహం పక్కన కూర్చున్నారు. తండ్రి గుండెలపై చేయి వేసి నిమురుతూ గట్టిగా ఏడ్చేశారు. అప్పటి వరకూ ఉద్విగ్నంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హృద్యంగా మారిపోయింది. కుటుంబ సభ్యులంతా భోరున విలపిస్తూ కృష్ణార్జున్ రెడ్డి వద్దకు వెళ్లి ఓదార్చారు. 




ఆ తర్వాత తల్లి, తాత, నాయనమ్మల్ని దగ్గరకు తీసుకుని విలపించారు కృష్ణార్జున్ రెడ్డి. పుట్టెదు దుఖంలోనూ సోదరికి ధైర్యం చెప్పారు. ఇతర కుటుంబ సభ్యులంతా కృష్ణార్జున్ రెడ్డిని మరో రూమ్ లోకి తీసుకెళ్లారు. అప్పటి వరకూ అక్కడున్నవారంతా ఆ సన్నివేశం చూసి కంటతడి పెట్టారు. గౌతమ్ రెడ్డికి, ఆయన కుమారుడికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నారు. 


ఈరోజు మధ్యాహ్నం 11గంటలకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయగిరిలో అధికారిక లాంఛనాలతో జరుగుతాయి. ఏపీ సీఎం జగన్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాబోతున్నారు. గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు జరిపేందుకు ముందు నిర్ణయించినా, ఆ తర్వాత ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంతంలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది ప్రజలు అంత్యక్రియలు జరిగే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఆయన అంతిమయాత్రకు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. నెల్లూరులో పార్థివ దేహాన్ని చూసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి నేతలు తరలి వచ్చారు. మిగిలిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, సన్నిహితులు.. నేరుగా ఉదయగిరికి వస్తారని తెలుస్తోంది. 


భారీ భద్రతా ఏర్పాట్లు.. 
సీఎం జగన్ ఉదయగిరి వస్తుండటంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు జిల్లా పోలీసులు. డీఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ విజయరావు ఉదయగిరిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇతర నాయకులు, అధికారులు ఉదయగిరి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. 


Also Read: CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్‌ కేసు ! తర్వాత ఏంటి ? 


Also Read: Weather Updates: హాట్ హాట్‌గా ఏపీ, ఒక్కరోజే తెలంగాణలో 4 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు