Kakani On Lokesh Delhi Tour: లోకేష్ ఢిల్లీ యాత్ర అట్టర్ ఫ్లాప్‌ అని అన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. లోకేష్ ని ఎవరూ ఢిల్లీలో పట్టించుకోలేదని చెప్పారు. ఇక్కడ తెలుగులో మాట్లాడినట్లే ఢిల్లీలోనూ లోకేష్ అరకొర జ్ఞానంతో మాట్లాడుతున్నారని, జాతీయ మీడియా ప్రశ్నలకు లోకేష్ దగ్గర సమాధానాలేవీ లేవన్నారు. చంద్రబాబును ఎలా జైలు నుంచి బయటకు తీసుకురావాలనే విషయంపై లాయర్లను కలిసేందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లారని ఎద్దేవా చేశారు కాకాణి. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేస్తే.. రకరకాలుగా టీడీపీ నాయకులు కథలల్లేవారని, ఈరోజు లోకేష్ ఢిల్లీ పర్యటన చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని బీజేపీ నేతల్ని కోరడానికే కదా అని ప్రశ్నించారు. నాయకుల దగ్గరకు వెళ్లి కాళ్ల మీద పడి కేసు నుంచి చంద్రబాబును బయటకు తీసుకురావాలని అడగటం లోకేష్ అజెండా అని చెప్పారు. 


ఆయన ప్యాకేజీ స్టార్..
యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తానని చంద్రబాబు తన నైపుణ్యంతో డబ్బులు కొట్టేశాడని అన్నారు కాకాణి. నిర్మాతల దగ్గర రెమ్యునరేషన్‌ తీసుకుని కెమెరా ముందు నటించే పవన్, ఇప్పుడు చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకుని ప్రజల దగ్గర మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దానికీ దీనికీ తేడా ఏమీ లేదన్నారు. సంస్కారం ఉన్నవారు ఎవరైనా జైలులో డీల్ మాట్లాడుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ మీద నమ్మకం లేదని బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని పవన్ జైలులో డీల్ మాట్లాడుకున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని గతంలో పవన్ ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే లోకేష్ తన తల్లిని దూషించారని, వారి అంతు చూస్తానని పవన్ అన్న మాటల్ని కూడా గుర్తు చేశారు. ఆ మాటలన్న పవన్ ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 4 శాతం కూడా ఓట్లు లేని పవన్, వైసీపీని అడ్డుకుంటానని చెప్పడమేంటన్నారు. బలం, బలగం ఉంటే పవనే సొంతగా అధికారంలోకి వచ్చి ఉండేవారని, పవన్ కి రాజకీయ పరిణితి లేదని అర్థమౌతోందన్నారు. పవర్ స్టార్‌ కాస్తా ప్యాకేజీ స్టార్ అయిపోయాడని కౌంటర్ ఇచ్చారు.


స్కిల్ స్కామ్ లో లోకేష్ అవినీతికి పాల్పడ్డారని ఆయన కుటుంబమే భావిస్తోందని, అరెస్ట్ పై రోజుకో మాట టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు కాకాణి. లోకేష్ ని కూడా అరెస్టు చేస్తారేమో అని భార్య బ్రాహ్మణి కూడా మాట్లాడారని, ఈ అరెస్టు భయం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. స్కామ్ జరిగిందని కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి.. వారికి అరెస్ట్ విషయం కూడా తెలుసన్నారు. అందుకే లోకేష్ ని అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారని చెప్పారు. జరిగినవన్నీ సీఐడీ విచారణలో బయటపడుతున్నాయని అన్నారు కాకాణి. చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా లోపలికి పోతారనే భయం వారిలో ఉందన్నారు. 


రాజమండ్రి జైల్‌ సూపరింటెండెంట్ రాహుల్ భార్య అనారోగ్యంతో ఆయన సెలవు పెడితే.. దాన్ని కూడా వక్రీకరించారని మండిపడ్డారు కాకాణి. చివరికి జైలు సూపరింటెండెంట్ భార్య అనారోగ్యంతో మృతి చెందారని చెప్పారు. ఇలాంటి రాతలు రాయడం ఏపీలోనే సాధ్యమైందన్నారు. ఇంతకంటే.. దౌర్భాగ్య పరిస్థితులు ఇంకేవీ లేవన్నారు కాకాణి. కోర్టుల నుంచి సాంకేతిక కారణాలతో చంద్రబాబు స్టేలు తెచ్చుకొని కొనసాగుతున్నారని, లేకపోతే చంద్రబాబు చేసిన అవినీతికి ఎప్పుడో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉండేదన్నారు కాకాణి. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు దిట్ట అని, సీఐడీ అన్ని ఆధారాలతో కోర్టు ముందు ఉంచిందని చెప్పారు. చంద్రబాబు మీద ఆధారాలున్నా.. శిక్ష వేయకూడదు..  శిక్షిస్తే.. మాత్రం న్యాయమూర్తులను, న్యాయవాదులను వదలం అని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, రాజ్యాంగాన్ని టీడీపీ నాయకులు ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.