Andhra Pradesh News: మేకపాటి రాజమోహన్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడే కాదు ప్రముఖ వ్యాపారవేత్త కూడా. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపత్తులు వచ్చినప్పుడు ఆయన తన కంపెనీల తరపున విరాళాలు ప్రకటిస్తుంటారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల వరద సహాయం కోసం మొత్తం రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు మేకపాటి. ఏపీ సీఎం చంద్రబాబుని నేరుగా కలిసి ఇచ్చేందుకు ఆయనకు రాజకీయం అడ్డొచ్చింది. అందుకే తన విరాళం చెక్ ని స్పీడ్ పోస్ట్ లో చంద్రబాబు అడ్రస్ కి పంపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం నేరుగా కలసి ఆయనకు చెక్ అందించారు. పొరుగు రాష్ట్ర సీఎంని కలిసేందుకు తీరిక ఉన్న మేకపాటి, చంద్రబాబుని కలవడానికి ఎందుకు మొహమాటపడ్డారనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి మంచి పట్టు ఉంది. నెల్లూరు లోక్ సభ ఎంపీగా ఆయన పదేళ్లు పనిచేశారు. ఆయన తనయుడు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. మరో తనయుడు విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. మేకపాటి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉదయగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. పరిస్థితులు అనుకూలించి ఉంటే మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు, కానీ కుదర్లేదు. అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత జగన్ పక్షాన నిలబడి వైసీపీలో కొనసాగుతోంది మేకపాటి కుటుంబం. అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తాజా ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. రాజమోహన్ రెడ్డి సహా మిగతా కుటుంబం అంతా వైసీపీలోనే ఉంది. ఇక పార్టీలైన్ ని కూడా ఎప్పుడూ మేకపాటి ఫ్యామిలీ దాటి వ్యవహరించలేదు. తాజా ఘటనే దీనికి పెద్ద ఉదాహరణ.
ఏపీ వరదలకు మాజీ సీఎం జగన్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆ కోటి రూపాయలపై పెద్ద రచ్చ జరుగుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆ కోటి ఎప్పుడు జమ చేస్తారంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. మా సాయం మేమే పంచుతామంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించారు. చెరో 25 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. KMC కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ తరపున చెక్కులు రెడీ చేశారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబుని కలిసేందుకు ఆయన ఇబ్బంది పడ్డారు. వైసీపీ నేతగా ఆయన చంద్రబాబుని కలసి నేరుగా చెక్కుని అందించి ఫొటో దిగితే పార్టీ అధిష్టానానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని గ్రహించారు. అందుకే ఆ విరాళాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా సీఎం చంద్రబాబుకి పంపించారు.
ఏపీ సీఎంతో సమస్యలున్నాయి కానీ, తెలంగాణ సీఎంతో ఎలాంటి సమస్య లేదు. రేవంత్ రెడ్డిని కలసినా వైసీపీలో ఎవరూ పెద్దగా ఆక్షేపించరు. అందుకే ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలసి తన విరాళాన్ని అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ని కలిసే సమయంలో తనతోపాటు తన తనయుడు పృథ్వి రెడ్డిని కూడా తీసుకెళ్లారు రాజమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మేకపాటిని శాలువాతో సత్కరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుని కలసినా ఇలాంటి సన్మానాలు, సత్కారాలు ఉంటాయి కాబట్టే.. మేకపాటి వెనకడుగు వేశారు. వైసీపీలో ఉన్నారు కాబట్టి.. చంద్రబాబుని కలిసేందుకు ఆయన ఇష్టపడలేదు. పొరుగు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం నేరుగా కలసి తన విరాళం అందించారు.