AP Government World Record In Gram Sabhas: ఏపీ ప్రభుత్వం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఆగస్ట్ 23న ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ (Swarna Grama Panchayat) పేరిట ఒకే రోజు రికార్డు స్థాయిలో 13,326 చోట్ల గ్రామసభలు నిర్వహించింది. రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (World Records Union) గుర్తించింది. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ తమ రికార్డుల్లో నమోదు చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు (Deputy CM Pawan Kalyan) సోమవారం యూనియన్ ప్రతినిధి ధ్రువపత్రాన్ని, మెడల్‌ను అందించారు. పంచాయతీ రాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఈ ప్రపంచ రికార్డు నమోదైంది. 










పవన్ హర్షం


గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామసభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామసభల్లో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ శ్రీ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శ్రీ శివప్రసాద్ పాల్గొన్నారు.


గ్రామ స్వరాజ్యం దిశగా...


గ్రామ స్వరాజ్యం కోసం ఏపీ ప్రభుత్వం బలంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక సంస్థల పాలన బలంగా ఉండాలన్నదే ప్రధాన ఆలోచనగా ఉన్నారు. గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామస్థులే నిర్ణయించుకునే అధికారం ఉందని, గ్రామసభల్లో చర్చించి తీర్మానం చేసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణుల్లో గ్రామసభల తీరు తెన్నులపై చైతన్యం కలిగించడంలో ఆయన ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు స్వపరిపాలన, సుపరిపాలన దిశగా అడుగలు వేస్తున్నాయి. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి ‘స్వర్ణ పంచాయతీ’లుగా అభివృద్ధి చెందేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం.   


రూ.4,500 కోట్ల పనులకు ఆమోదం


అందుకు అనుగుణంగా ఆగస్ట్ 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనులు, వివిధ పథకాలు ఉపయోగించుకొని గ్రామాలు ఎలా అభివృద్ధి బాటలో సాగాలన్నదానిపై విస్తృత్తంగా చర్చించారు. ఒకేరోజున రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల పనులను ఆమోదించారు. 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ పనుల వల్ల 9 కోట్ల మందికి ఉపాధి లభించేలా, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామసభల్లో నిర్ణయాలు జరిగాయి.


గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాం నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేందుకు గ్రామస్థులంతా ఒకేసారి రాష్ట్రంలో ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలను తూతూమంత్రంగా నిర్వహించకుండా గ్రామీణులంతా కలిసి కూర్చొని చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా చైతన్యం కలిగించింది. మహిళలు, యువత గ్రామసభలకు తరలివచ్చి గ్రామానికి ఏమి అవసరమో దానిపై చర్చించి, తీర్మానం చేసేలా ప్రోత్సహించింది. ఫలితంగా ఈ గ్రామ సభల నిర్వహణ దేశంలోనే జరిగిన అతి పెద్ద గ్రామపాలన కార్యక్రమంగా ప్రపంచ రికార్డులకెక్కింది.


Also Read: PV Midhun Reddy: టీడీపీ నాయకులను ఘనంగా సన్మానిస్తా - వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు