YSRCP Latest News: రాబోయే ఎన్నికల్లో అవసరమైతే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వైఎస్ఆర్ సీపీ ఎంపీ పీవీ మిధున్ రెడ్డి ప్రకటించారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎంపీ మిధున్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. భారీ కాన్వాయ్ లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో పుంగనూరు పట్టణానికి ఎంపీ మిధున్ రెడ్డి వచ్చారు. అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. పుంగనూరు నియోజకవర్గ తనకు కన్నతల్లితో సమానం అని.. నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు సహకరిస్తానని అన్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని.. మైనారిటీలకు అండగా ఉంటామని వెల్లడించారు. వైసీపీ పార్టీ ఎప్పుడు ముస్లింలకు అండగా ఉంటుందని అన్నారు. అంజుమన్ కమిటీ నిర్వహించనున్న కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి రూ.కోటి రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. నియోజవర్గంలో అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరిస్తామని వెల్లడించారు. పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ పాలన చేసిన అభివృద్ధిని ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల తర్వాత పట్టణంలో గడపగడపకు పర్యటిస్తానని అన్నారు.
వైఎస్ఆర్ సీపీ పరిపాలనలో పెప్పర్ మోషన్ కంపెనీకి స్థలాన్ని కేటాయించామని.. పెప్పర్ మోషన్ కంపెనీని స్వాగతించాలని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థను ప్రభుత్వం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. 50 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో టెండర్లు కూడా పూర్తయిన వాటర్ గిడ్జ్ పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయాలని మిధున్ రెడ్డి కోరారు. పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే టీడీపీ నాయకులను ఇక్కడే ఘనంగా సన్మానిస్తానని మిధున్ రెడ్డి తెలిపారు.