కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పై నారా లోకేష్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వివాహిత హత్య కేసులో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారని, అందుకే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపించారు. వివాహిత సోదరుడు పెట్టిన ట్వీట్ కి స్పందిస్తూ కనిగిరి ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు నారా లోకేష్.


"సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన తన చెల్లి స్వాతిని అదనపు కట్నం కోసం వేధించి చంపిన భర్త శ్రీకాంత్, అత్తమామలను కఠినంగా శిక్షించాలని పోరాడుతున్న వాసుకి అండగా ఉంటాను‌. అత్యంత దారుణంగా స్వాతిని చంపేస్తే.. కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో, ఆత్మహత్యగా కేసు నమోదు చేయడం దారుణం. "


"నిందితులు బంధువులు కావడంతో కేసు దర్యాప్తుని ఎమ్మెల్యే పక్కదారి పట్టించడం మానుకోవాలి. ఎమ్మెల్యే కుమార్తెకి స్వాతికి లాగే అన్యాయం జరిగితే ఇలాగే కేసుని నీరుగారుస్తారా? అని ప్రశ్నిస్తున్నాను." అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.






అసలేంటి ఈ కేసు..?


ఏడాదిన్నర క్రితం ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేవిపల్లికి చెందిన రిటైర్డ్ మిలటరీ ఉద్యోగి అయినాబత్తుల వెంకటేశ్వర్లు కుమార్తె స్వాతికి, ఒంగోలు భాగ్యనగర్ నివాసి శ్రీహరి కుమారుడు వెంకట శ్రీకాంత్‌తో 2020 మే 13న వివాహం జరిగింది. భార్యా భర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. లాక్ డౌన్ కారణంగా ఆ తర్వాత వారు ఇంటి వద్దనుంచే ఉద్యోగం చేసేవారు. శ్రీహరి ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసేవారు. 2021లో ఆయనకు యాక్సిడెంట్ కావడంతో విధులకు వెళ్లలేదు. కొడుకు వెంకట శ్రీకాంత్ కి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అనుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే అతడికి ఎక్కువ కట్నం ఇచ్చే భార్య వస్తుందని భావించి స్వాతిని వదిలించుకోవాలని చూశారు.




స్వాతిపై మెల్లగా చిత్రహింసలు మొదలయ్యాయి. ఆ హింసల్ని తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి అత్తగారింటికి వెళ్లింది. అక్కడ హింసలు మరీ ఎక్కువయ్యాయి. భరిస్తూనే భర్తతో కాపురం చేస్తూ వచ్చింది స్వాతి. చివరకు ఓ రోజు స్వాతి తల్లిదండ్రులకు ఓ ఫోన్ వచ్చింది. స్వాతి ఉరేసుకుని ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఆమె మామ శ్రీహరి సమాచారమిచ్చాడు. దీంతో తల్లిదండ్రులు, స్వాతి సోదరుకు శివ క్కడికి వెళ్లారు. అది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. స్వాతి భర్త వెంకట శ్రీకాంత్ స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కి అనుచరుడని, అందుకే ఆయన రాజకీయ పలుకుబడి ఉపయోగించి హత్య కేసుని, ఆత్మహత్య కేసుగా మార్చేశారని అంటున్నారు. స్వాతి సోదరుడు శివ ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా న్యాయం కోసం పెద్ద ఉద్యమమే చేపట్టారు. వైసీపీ నేతల్ని వేడుకున్నాడు, ఫలితం లేదు, ఆ తర్వాత జనసేన నాయకులను కూడా ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెట్టాడు, అయినా కూడా ఫలితం లేదు. చివరిగా ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేష్, స్వాతి మరణంపై ఆమె సోదరుడు పెట్టిన పోస్టింగ్ పై స్పందించారు. ఎమ్మెల్యే కారణంగా హత్య కేసుని, ఆత్మహత్యగా మార్చేశారని, ఇదెక్కడి ఘోరం అంటూ ప్రశ్నించారు. స్వాతి కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు నారా లోకేష్.