2019 ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పిన ఫేమస్ డైలాగ్ ఇది. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా ఉపయోగించలేదు. తాజాగా ఆయన నెల్లూరులో నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆ డైలాగ్ గుర్తు చేశారు. గతంలో తాను ప్రచారానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీని అమలు చేశానని, ఆ మాట చెప్పేందుకే నెల్లూరుకు వచ్చానని అన్నారు జగన్. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ను ఆయన జాతికి అంకితం చేశారు. తన తండ్రి మొదలు పెట్టిన థర్మల్ పవర్ స్టేషన్ ను తాను జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. 20వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఇందులో మొత్తం మూడు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో తయారు చేశారు. మూడో యూనిట్ పనులు పూర్తికావడంతో సీఎం జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు.




నవంబర్ లోగా ఉద్యోగాలు..


థర్మల్ పవర్ స్టేషన్ కు భూములు ఇచ్చిన కుటుంబాలకు నవంబర్ లోగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్. 16337 మత్స్యకారేతర కుటుంబాలకు ఆయన 36 కోట్ల రూపాయల పరిహారాన్ని బటన్ నొక్కి అందించారు. గత ప్రభుత్వం కేవలం 3500మందికి పరిహారం ఇచ్చిందని, ఒక్కో కుటుంబానికి కేవలం 14వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని, అది కూడా సరిగా పంపిణీ చేయలేకపోయారని చెప్పారు జగన్. అప్పట్లో పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నవారందరికీ తమ హయాంలో న్యాయం జరిగిందన్నారు.


థర్మల్ పవర్ స్టేషన్ ని జాతికి అంకితం చేయడంతోపాటు పలు ఇతర కార్యక్రమాలకు కూడా ఆయన నేలటూరులోనే శంకుస్థాపన చేశారు. నెల్లూరు ముదివర్తి మధ్య సబ్ మెర్సబుల్ కాజ్ వే కి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నట్టు తెలిపారు జగన్. దీనికి 93కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. 25కోట్ల రూపాయలతో జెట్టి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసినట్టు తెలిపారాయన. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోరిక మీదట, నెల్లూరు బ్యారేజ్ కి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పెడుతున్నామని అన్నారు జగన్.


మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అడిగిన రెండు బ్రిడ్జ్ ల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని సాకారం చేస్తున్నామని అన్నారు జగన్. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టామని, మత్స్యకారులకు ఇది ఎందో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నిటినీ ఇప్పుడు నెరవేరుస్తున్నాని చెప్పారు.


ముత్తుకూరు మండలంలోని నేలటూరు పట్టపుపాళెం వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ జెట్టి నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ జెట్టి అందుబాటులోకి వస్తే ఉప్పు కాలువల్లో, క్రీక్‌ ల్లో బోట్లు, వలలను భద్రపరుచుకునే ఇబ్బందులు మత్య్సకారులకు తప్పిపోతాయి. ఫిషింగ్‌ జెట్టీ వద్ద వాటిని భద్రపరుచుకొనే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి బోట్లు, వలలను కాపాడుకోవచ్చు.