నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్‌ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చంద్రబాబుకి మూడు పంగ నామాలు పెట్టడం అలవాటు అని, అందుకే మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెబుతుంటారని, గతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వాసితులకు హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు మంత్రి కాకాణి. 2019 ఎన్నికల సమయంలో తాము నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని అమలు చేశామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారందరికీ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. 7 పంచాయితీల వారికి న్యాయం చేశామని చెప్పారు కాకాణి. లక్షా 75వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు బటన్ నొక్కిన చేతుల మీదుగా.. ఈరోజు 36 కోట్ల రూపాయలు ప్యాకేజీని కూడా ప్రజలకు అందిస్తున్నామన్నారు మంత్రి కాకాణి.
మాటలు రావట్లేదు, అయినా అడుగుతున్నాం..
జగన్ చూస్తే తమకు మాటుల రావట్లేదని, ఏది అడిగినా కాదు అనరని, ఏది కావాలన్నా లేదు అని చెప్పరని, అందుకే ఆయన్ని ఏది అడిగినా కాదనరనే ధైర్యంతో తాము ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలని కోరినట్టు తెలిపారు కాకాణి. జగన్ కాకుండా వేరెవరైనా ఈ రాష్ట్రానికి సీఎం అయి ఉంటే, నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ, ఫిషింగ్ జెట్టి వచ్చేది కాదన్నారు కాకాణి.
బాంబులు తెస్తాడనుకున్నా..
చంద్రబాబు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు థర్మల్ పవర్ స్టేషన్లపై తీవ్ర విమర్శలు చేశారని, వాటిని బాంబుతో పేల్చేస్తానన్నారని గుర్తు చేశారు కాకాణి. ఆ తర్వాత అయన అధికారంలోకి వచ్చాక నేలటూరు వచ్చారని, కానీ అదే థర్మల్ పవర్ స్టేషన్లకు ఆయన రిబ్బన్ కట్ చేసి వెళ్లారని చెప్పారు. బాంబులు తీసుకొస్తారేమో అనుకుంటే నిస్సిగ్గుగా, తనకు సంబంధం లేకపోయినా ఆయన థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించారని విమర్శించారు కాకాణి.
జగన్ కి మా విన్నపం..
థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం కోసం వచ్చిన సీఎం జగన్ కు, స్థానిక సమస్యలను వివరించారు మంత్రి కాకాణి. ఉప్పు కాలువపై బ్రిడ్జ్ కోసం 12 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. కృష్ణపట్నం నక్కల కాలువ వాగుపై కూడా బ్రిడ్జ్ నిర్మాణానికి సహకరించాలన్నారు. మొత్తంగా 21.40 కోట్ల రూపాయలతో మంజూరు చేయాలని జగన్ కి విన్నవించారు కాకాణి. ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాము స్థానికంగా ఇచ్చిన హామీలను కూడా సీఎం జగన్ అమలు చేశారని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఏపీ జెన్కోని జాతికి అంకితం చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రం విద్యుత్ రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తోందని అన్నారు కాకాణి.