ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ల్యాండర్, రోవర్, ఉపగ్రహానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ఇటీవలే విడుల చేసింది. జులై-12న ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జులై-12న చంద్రయాన్-3 మిషన్ ప్రయోగిస్తారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV- Mk III నుండి చంద్రయాన్-3 మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. భూమిపై కాకుండా మరో ప్రదేశంలో తన వాహనాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యాన్ని పొందడమే ఈ మిషన్ ఉద్దేశం.
చంద్రయాన్ 3 శాటిలైట్ మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారతదేశపు అత్యంత బరువైన రాకెట్ చంద్రయాన్-3. ఇస్రో చేత తయారు చేయబడిన మూడు దశల ప్రయోగ వాహనం ఇది. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ , ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు రోవర్ ఉంటాయి. ఇది గ్రహాంతర మిషన్ లకు అవసరమైన కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది. ల్యాండర్ మాడ్యూల్ కు నిర్ణీత ప్రదేశంలో రోవర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యం ఉంటుంది.
చంద్రుని మీద ప్రయోగానికి సన్నద్ధం చేసే హాట్ టెస్ట్, కోల్డ్ టెస్టులు ఇప్పటికే పూర్తి అయ్యాయని ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చంద్రయాన్-3లో హార్డ్‌వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, సెన్సార్లలో మార్పులు చేశారు. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కోసం పెద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. అదనపు సెన్సార్ కూడా జోడించారు. దీని వేగాన్ని కొలవడానికి లేజర్ డాప్లర్ వెలాసిటీమీటర్ ను కూడా అమర్చారు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా, పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపిస్తున్నారు.
చంద్రయాన్ -1 ను 2008 అక్టోబర్ 22 న పిఎస్ఎల్వి-XL రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ యాత్రలో ఇంపాక్టర్ ప్రయోగించారు. చండ్రుడిపై నీరు ఉందని ఈ ఇంపాక్టర్ కనుక్కుంది. అప్పటికి భారత్ తరపున ఇదే పెద్ద విజయం. దీనితో పాటు, చంద్రుని మ్యాపింగ్, వాతావరణ ప్రొఫైలింగ్ వంటి ఇతర పనులను కూడా చంద్రయాన్ -1 చేసింది.
చంద్రయాన్ 3 శాటిలైట్ మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక చంద్రయాన్-2 విషయానికొస్తే..
2019 జులైలో చంద్రయాన్-2 ప్రయోగించారు. 2019 జూలై 15 న ఈ ప్రయోగం చేయాలని అనుకున్నా, సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు. క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్‌ఎల్‌వి MK3 M1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. భూ కక్ష్యనుంచి విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ఈ మిషన్ ని ప్రవేశ పెట్టారు. చంద్రుని కక్ష్యలో చేరాక, ప్లాన్ ప్రకారమే ఆర్బిటరు, ల్యాండరు విడిపోయాయి. ఆ తరువాత ల్యాండరు ఆ కక్ష్య నుండి రెండు అంచెలలో దిగువ కక్ష్య లోకి దిగి, అక్కడి నుండి చంద్రుడి ఉపరితలం పైకి ప్రయాణం సాగించింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తులో ఉండగా, దానికి భూమితో సంబంధాలు తెగిపోయాయి. చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టడంలో విఫలమైంది. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు నేలకూలిందని ఇస్రో ప్రకటించింది.
చంద్రయాన్-3 పై ఇస్రో భారీ అంచనాలు పెట్టుకుంది. చంద్రయాన్-2 వైఫల్యాలను అదిగమించి దీన్ని సక్సెస్ చేయాలని నిర్ణయించారు ఇస్రో అధికారులు. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. జులై-12న చంద్రయాన్-3 ప్రయోగం మొదలవుతుంది. అయితే చంద్రయాన్ మిషన్ చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయినప్పుడే ఇది సక్సెస్ అయినట్టు లెక్క. చంద్రయాన్ కి సంబంధించి తాజా ఫోటోలను ఇస్రో విడుదల చేయడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత్ ఆసక్తి పెరిగింది.