ఇప్పటి వరకూ ఉపగ్రహాల ప్రయోగాన్నే ఆసక్తిగా చూసేవాళ్లం. ప్రయోగం విజయవంతం అవుతుందా కాదా అనే ఉత్కంఠ శాస్త్రవేత్తలతోపాటు సామాన్యుల్లో కూడా ఉంటుంది. చివరకు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లో ప్రవేశ పెట్టాక రాకెట్ ప్రయోగం విజయవంతం అయిందంటూ శాస్త్రవేత్తలు ఉత్సాహంగా కేరింతలు కొట్టేవారు. కానీ ఈసారి ఈ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. తాము కక్ష్యలో ప్రవేశ పెట్టిన ఉపగ్రహాన్ని తామే కూల్చేసి సంబరాలు చేసుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీనికి కారణం ఏంటి..? కూల్చివేతలో కూడా ఇస్రో అరుదైన ఘనత సాధించిందా..?
అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి సాధించిన దేశాలన్నీ విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశ పెట్టగలుగుతున్నాయి. అంతరిక్షయానాలకు మార్గాలను సుగమం చేసుకున్నాయి. కానీ కాలపరిమితి తీరిపోయిన ఉపగ్రహాలను కూల్చేయడం మాత్రం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ మధ్య చైనా ఇలా ఉపగ్రహాలను కూల్చేయడానికి ఆపసోపాలు పడింది, చివరకు విఫలం అయింది. కానీ ఇస్రో టార్గెట్ మిస్ కాలేదు. కాలపరిమితి తీరిపోయిన ఉపగ్రహాన్ని పూర్తి స్థాయి నియంత్రిత విధానంలో సురక్షితంగా సముద్రంలో కూల్చివేసింది. మేఘ-ట్రోపికస్-1 అనే ఈ ఉపగ్రహాన్ని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేసినట్లు ఇస్రో ప్రకటించింది. భూవాతావరణంలోకి ప్రవేశించేంత వరకు ఇస్రో దాని గమనాన్ని పరిశీలించింది. ఆ తర్వాత ఉపగ్రహం పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది.
మేఘ-ట్రోపికస్-1
పన్నెండేళ్ల క్రితం ప్రయోగించిన ఉపగ్రహం ఇది. ఉష్ణమండల వాతావరణ, ఇతర వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ ఉమ్మడిగా మేఘ-ట్రోపికస్1 (ఎంటీ-1)ను 2011 అక్టోబర్ 12న ప్రయోగించారు. మిషన్ ప్రారంభంలో మూడేళ్ల కాల వ్యవధికోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. అయితే కాల పరిమితికి మించి దశాబ్దం పాటు ఇది వాతావరణానికి సంబంధించిన డేటాను సమర్థంగా అందించింది. 2021 వరకు తన సేవలు అందించింది. వాతావరణ అధ్యయనానికి పూర్తి స్థాయిలో సహకరించింది. ఆ తర్వాత దీని పనితీరు మందగించింది. ప్రస్తుతం మేఘ ట్రోపికస్ ఉపగ్రహాన్నుంచి సమాచార మార్పిడి పూర్తిగా నిలిచిపోయింది. అందుకే దీన్ని కూల్చేయాలని నిర్ణయించారు. ప్రయోగంలో ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సహకారం తీసుకున్నా.. కూల్చివేతను మాత్రం ఇస్రో ఒక్కటే పర్యవేక్షించింది.
ఎలా కూల్చేస్తారు..?
ఉపగ్రహాన్ని కూల్చేయాలంటే దానికి చాలా నిబంధనలు పాటించాలి. ఏ దేశం అయినా వారి ఇష్టం వచ్చినట్టు ఉపగ్రహాలను కూల్చేస్తామంటే కుదరదు. అది ఇతర దేశాలపై పడినా, జనావాసాలను ధ్వంసం చేసినా కూల్చివేసిన దేశమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాదాపుగా ఉపగ్రహం భూ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత వాతావరణంలో కలసిపోతుంది. కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రం అది ఇబ్బందిగా మారుతుంది. ఏ ఉపగ్రహానికి అయినా మిషన్ జీవితం ముగిస్తే.. ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (UNIADC) నిబంధనలకు కట్టుబడి ఉండాలి. యూఎన్ నిబంధనల ప్రకారం ఎంటీ-1ను వెంటనే కూల్చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఇస్రో దాన్ని కూల్చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం రాత్రి ఉపగ్రహాన్ని కూల్చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.
మేఘ-ట్రోపికస్-1 ఉపగ్రహం సమాచారాన్ని పంపించలేని స్థితికి వచ్చినా దానిలో ఇంకా 125 కిలోల ఇంధనం మిగిలి ఉంది. ఆ ఇంధనం సహాయంతోనే దాన్ని కూల్చి వేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ముందుగా ఉపగ్రహాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తదెచ్చుకున్నారు. దాన్ని రీ-ఎంట్రీ చేశారు. భూమి వాతావరణంలోకి ఉపగ్రహం ప్రవేశించే వరకు పూర్తిగా ఇస్రో కంట్రోల్ లోనే ఉంది. ఆ తర్వాత దాన్ని భూమిపై పడకుండా జాగ్రత్తగా దిశను మళ్లించారు. పసిఫిక్ మహా సముద్రంలో పడేలా శాస్త్రవేత్తలు దాన్ని నియంత్రించారు. చివరకు విజయం సాధించారు.