ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరిద్దరూ వైసీపీకి దూరం జరిగారు. వారి స్థానాల్ల నియోజకవర్గ ఇన్ చార్జ్ లను ప్రకటించిన అధిష్టానం పూర్తిగా వారిని పక్కనపెట్టింది. కనీసం అధికారులు కూడా వారి మాట వినకుండా చేసింది. పేరుకే ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకంటే వారి పరిస్థితి దారుణంగా ఉంది. మరి రోజులు గడుస్తున్నా వారిద్దరూ ఇంకా సైలెంట్ గానే ఉన్నారెందుకు..? కోటంరెడ్డి రూటు ఎటు..? ఆనం దారెటు..?


ఆనం అంతా సైలెన్స్..


వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆ మధ్య కొన్ని మండలాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. 2024లో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేదానితోపాటు, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనేది కూడా పెద్ద సస్పెన్స్ గా మారింది. దాదాపుగా ఆయన వెంకటగిరినుంచి తిరిగి పోటీ చేసే అవాకశం లేదు. కోటంరెడ్డి ఎపిసోడ్ జరగకపోయి ఉంటే నెల్లూరు రూరల్ ని ఆనం ఫిక్స్ చేసుకునేవారు, అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేవారు. కానీ పరిస్థితులు సానుకూలంగా లేవు. నెల్లూరు రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. సో.. ఆనం టీడీపీలో చేరినా ఆ నియోజకవర్గం ఆయనకు దక్కదు. ఇక ఆనంకి ఉన్న మరో ఆప్షన్ ఆత్మకూరు. గతంలో ఆయన ఆత్మకూరునుంచి పోటీ చేసి గెలిచి, మంత్రి పదవి కైవసం చేసుకున్నారు. ఆ సెంటిమెంట్ బాగానే ఉందనుకున్నా.. గతంలో ఆయన కుమార్తెను టీడీపీనుంచి ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. దాన్ని ఆయన ఎప్పుడూ ఖండించలేదు. అంటే ఆనంకి ఆత్మకూరుతోపాటు మరో నియోజకవర్గం కూడా కావాలి. అందుకే ఆయన ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.


కోటంరెడ్డి దూకుడు..


ఆనం నిష్క్రమణలో పెద్దగా సంచలనాలేవీ లేవు. ఆయన ప్రభుత్వంపై ఓ మోస్తరు విమర్శలు చేశారు, జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఎమ్మల్యే కోటంరెడ్డి మాత్రం ప్రభుత్వం తన ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ ఘాటు విమర్శలు చేశారు. అక్కడ కూడా జగన్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఎంపీ ఆదాలను నియమించారు. ఆ తర్వాత కోటంరెడ్డిని ప్రభుత్వం పూర్తిగా టార్గెట్ చేసిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. గతంలో టీడీపీ నేతలపై జరిగిన దాడి కేసులో కోటంరెడ్డి బ్రదర్స్ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే కోటంరెడ్డి అనుచరులను అరెస్ట్ చేశారు, కోటంరెడ్డి విషయంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారేమోననే అనుమానాలున్నాయి. 


టీడీపీ నుంచి ఆహ్వానాలున్నాయా..?


కోటంరెడ్డి అయినా, ఆనం అయినా.. ఇద్దరూ టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరి టీడీపీనుంచి వీరికి ఆహ్వానం ఉందా, కనీసం టికెట్ ఇస్తారనే హామీ ఉందా అనేది అటువైపు నుంచి అంత బలంగా వినపడటంలేదు. కోటంరెడ్డి విషయానికొస్తే.. ఆయన్ను పార్టీలోకి తీసుకోవద్దు అంటూ నెల్లూరు రూరల్ టీడీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు కుండబద్దలు కొట్టారు. టీడీపీ నేతలపై కోటంరెడ్డి గతంలో దాడులు చేయించారని, అలాంటి నాయకుడు తమకు అక్కర్లేదని అంటున్నారు. ఆనం విషయానికొస్తే అలాంటి అడ్డంకులు అస్సలు లేవు. ఆనం ఏ నియోజకవర్గానికి వచ్చినా ఆయనకు టీడీపీలో స్వాగతం పలికేందుకు స్థానిక నేతలు సిద్ధంగానే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్ల ప్రస్తుతం వైసీపీ హవా నడుస్తోంది. ఆనం, కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీలోకి వస్తే.. కనీసం ఆ రెండు స్థానాల్లో అయినా విజయావకాశాలుంటాయని అంటున్నారు.