భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తదుపరి ప్రయోగం అయిన పీఎస్‌ఎల్‌వీ సీ - 52కు కౌంట్ డౌన్ మొదలైంది. లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ ఆమోదం పొందడంతో కౌంట్ డౌన్‌ను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. పీఎస్‌ఎల్వీ - సీ 52 వాహక నౌక ప్రయోగాన్ని సోమవారం ఉదయం 5.59 గంటలకు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ కౌంట్ డౌన్ ఇది 25.30 గంటల పాటు కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ - 52 అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. 


PSLV-C52 రాకెట్ రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకువెళ్లనుంది. ఇందులో కొలరాడో విశ్వవిద్యాలయం లాబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ సహకారంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహం (INSPIREsat-1) కూడా ఉంది. బౌల్డర్, ఇస్రో సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం (INS-2TD) కూడా నింగిలోకి వెళ్లనుంది. ఇది ఇండియా - భూటాన్ జాయింట్ శాటిలైట్ (INS-2B)కి అనుబంధ ఉపగ్రహం.


EOS-04 అనేది రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం, వ్యవసాయం, అటవీ, ప్లాంటేషన్‌లు, నేల తేమ, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్ వంటి అప్లికేషన్‌ల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి దీన్ని రూపొందించారు.


ఇస్రో చీఫ్ డాక్టర్‌ సోమనాథ్‌ శనివారం షార్‌కు చేరుకుని ఎంఆర్‌ఆర్‌ సమావేశం (ప్రయోగ సన్నాహక సమీక్ష)లో పాల్గొన్నారు. ఆదివారం కూడా ఆయన ఇక్కడే ఉండి, కౌంట్‌ డౌన్‌ అనంతర పనుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. శాస్త్రవేత్తలతో వివిధ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తున్నారు. కోవిడ్ సవాళ్లను అధిగమించి ఈ ఏడాదిలో తొలి ప్రయోగం సోమవారం జరగరబోతోంది. చాలా రోజుల తర్వాత ఇస్రో ఈ ప్రయోగం చేపడుతున్న సంగతి తెలిసిందే.