Nellore Police Chai With Beats: ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తున్నారంటే సిబ్బంది హడలిపోతారు, హడావిడి పడతారు. అదే ఉన్నతాధికారి తనతో కలసి టీ తాగేందుకు వస్తున్నాడంటే సంతోషిస్తారు, పనిలో మరింతగా చురుగ్గా ఉంటారు. సిబ్బందిలో అలాంటి చొరవను కలిగించేందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. "చాయ్ విత్ బీట్స్" అనే పేరుతో నగరంలో రాత్రివేళ సిబ్బంది పనితీరుని పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. 


"చాయ్ విత్ బీట్స్" కార్యక్రమంలో భాగంగా నేరుగా ఎస్పీ సిబ్బంది వద్దకు వెళ్తున్నారు. బీట్ పోలీసింగ్ నిర్వహిస్తున్న సిబ్బందితో కలసి టీ తాగి, వారిలో ఉత్సాహం నింపుతున్నారు. రాత్రి వేళ నవాబుపేట, ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్.. ఇతర ప్రాంతాల్లో బీట్ పోలీసింగ్ నిర్వహిస్తున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ విజయరావు (Nellore SP Vijaya Rao) కలిశారు. 




ఫ్రెండ్లీ పోలీసింగ్.. 
రాత్రి పూట గస్తీ లో ఉన్న సిబ్బంది, ఇతర అధికారులలో ఉత్సాహం, ఉత్తేజం నింపేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ విజయరావు. ఫ్రెండ్లీ పోలీసింగ్, విజబుల్ పోలీసింగ్ ని సమర్ధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరో ముందడుగు వేసినట్టయిందని చెప్పారు. రాత్రి వేళలో జరిగే గ్రేవ్ కేసులపై ఉక్కుపాదం మోపుతూ, అక్రమ రవాణా, చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కార్యక్రమం మొదలు పెట్టామని అన్నారు. గస్తీ నిర్వహించే పోలీసు సిబ్బంది పాత్ర ఇందులో కీలకం అని గుర్తు చేశారు ఎస్పీ. 




రాత్రి వేళలో వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఆ సమయంలో ప్రయాణానికి కారణాలు కనుక్కోవాలని, అనుమానితుల్ని వెంటనే ప్రశ్నించాలని, వారి చిరునామా పూర్తి వివరాలు రాబట్టాలని సిబ్బందికి సూచించారు. అనుమానిత వ్యక్తులు కనపడితే వెంటనే వేలిముద్రలు సేకరించాలని ఆదేశించారు. రాత్రి వేళలో ప్రయాణించే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఏమైనా రక్షణ సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు ఎస్పీ. 


"చాయ్ విత్ బీట్స్" కార్యక్రమంలో.. ఈ-బీట్ యాప్ పనితీరును, వినియోగాన్ని కూడా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. బీట్ బుక్ తనిఖీ చేసారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో బీట్ పోలీసింగ్ నిర్వహించేవారితో అదికారులు స్నేహా పూర్వకంగా ఉండాలని, వారి విధులు సమర్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందితో సన్నిహిత సంబంధాలకోసం, వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, పటిష్ట నిఘా కోసం.. "చాయ్ విత్ బీట్స్" కార్యక్రమం రూపొందించినట్టు తెలిపారు. 


Also Read: TDP MLC Ashok Babu: బెయిల్ రావడంతో అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విడుదల


Also Read: vizag steel plant anti privatization protest: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు ఉద్యమానికి నేటితో ఏడాది