TDP MLC Ashok Babu Bail Updates: నకిలీ డిగ్రీ డాక్యుమెంట్లు తో పదోన్నతి పొందారని ఆరోపణలతో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబుకు శుక్రవారం రాత్రి బెయిల్ మంజూరైంది. శుక్రవారం రాత్రి 12.20 గంటల ప్రాంతంలో అశోక్ బాబు విడుదల య్యారు. ఓ వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి 11.30కు ఇంటికి చేరుకున్న అశోక్ బాబును మఫ్టీలో వేచి చూస్తున్న పోలీసులు అరెస్టు (TDP MLC Ashok Babu Arrest) చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు దాదాపు 18 గంటలు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. సుదీర్ఘ విచారణల అనంతరం ఆయనకు 20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ లభించింది. శుక్రవారం రాత్రి కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి జస్టిస్ సత్యవతి అశోక్ బాబుకు బెయిల్ మంజూరు చేశారు.


గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ అశోక్ బాబును కలిసేందుకు ప్రయత్నించిన టీడీపీ మాజీ మంత్రులు, నాయకులు, న్యాయవాదులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అప్రజాస్వామికంగా అరెస్టు చేశారంటూ పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో దేవినేని ఉమా సహా పలువురు నాయకులను అరెస్టు చేసి నగరంపాలెం, నల్లపాడు స్టేష న్లకు తరలించి సాయంత్రం వరకు పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు.


వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో విద్యార్హతపై తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని లోకాయుక్తకు అందిన ఫిర్యాదు మేరకు అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను గుంటూరు లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బెయిల్ రాకుండా ఉండేందుకే ఆయన పై తాజాగా 467 సెక్షన్ కింద కేసు పెట్టారని, దీనికి పదేళ్ల శిక్ష పడుతుందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు మూసేశారు. కోర్టు రోడ్డు, అరండల్పేట పై వంతెన కింది భాగంలో ఉన్న రహదారులు, జీజీహెచ్ పరిసరాలు, నగరం పాలెం ఎస్బీఐ జంక్షన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.


అశోక్ బాబును కలిసిన టీడీపీ నేతలు..
శుక్రవారం అర్ధరాత్రి అశోక్ బాబు విడుదల కాగా, మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతల పట్టాభి రామ్ సహ పలువురు నేతలు ఎమ్మెల్సీని పరామర్శించారు. అప్రజాస్వామికంగా ఉద్దేశపూర్వకంగానే అశోక్ బాబును అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. పీఆర్సీ వివాదం రావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు నోటీసు ఇచ్చిన రోజే ఉమ్మడి ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై కేసులు నమోదు చేశారని పట్టాభి రామ్ అన్నారు. టీడీపీ నేతలను, ప్రజాప్రతినిధులను హింసించడమే వైఎస్ ప్రభుత్వం తమ లక్ష్యంగా చేసుకుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.

Also Read: Ashok Babu : అశోక్‌బాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారం - కేసు పెట్టాలని ఆదేశించిన లోకాయుక్తను కూడా పార్టీగా చేర్చాలన్న హైకోర్టు


Also Read: MLC Ashok Babu Arrest: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్, సీఐడీ ఆఫీసుకు తరలించిన అధికారులు