MLC Ashok Babu Arrest: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి అశోక్ బాబును అరెస్ట్ (TDP MLC Ashok Babu Arrest) చేసిన అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఉద్యోగ సమయంలో విద్యార్హతలు తప్పుగా చూపించారని అరోపణలున్నాయి. పదోన్నతి సమయంలోనూ విద్యార్హతలు తప్పుగా చూపించారని అభియోగాలున్నాయి. ఈ క్రమంలో సీఐడీ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు.


ఉద్యోగం చేసే సమయంలో అశోక్‌బాబు విద్యార్హతలు తప్పుగా చూపించారని ఏపీ సీఐడీ పోలీసులు తెలిపారు. అశోక్ బాబు అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో బీకాం చదివినట్టు తప్పుడు పత్రాలు ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు వివరించారు. అధికారులకు తప్పుడు పత్రాలు ఇచ్చి రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఏపీ సీఐడీ తెలిపింది. అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని ఓ ఉద్యోగి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్న గీతామాధురి సీఐడీకి సమాచారం అందిస్తూ ఫిర్యాదు చేశారు. సెక్షన్ 477ఏ, 465, 420 కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు అశోక్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి లోకాయుక్త రిపోర్ట్ తెప్పించుకుని సీఐడీ అధికారులు పరిశీలించారు. అశోక్‌బాబు కేసును సీఐడీకి అప్పగించాలంటూ లోకాయుక్త  2021 ఆగస్టులో ఆదేశాలు జారీచేయడం తెలిసిందే. ఈ కేసులో చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమ దృష్టికి తీసుకురావాలని లోకాయుక్త తన ఆదేశాలలో పేర్కొంది.



ఉద్యోగం చేసే సమయంలో విద్యార్హతల విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని లోకాయుక్తకు ఏపీ సీఐడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అశోక్ బాబు అరెస్టును టీడీపీ నేతలు ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అశోక్ బాబు ని అరెస్టు చేశారని టీడీపీ నేతలు విమర్శించారు. ఎమ్మెల్సీ హోదా వ్యక్తిపై పోలీసులు అకారణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Red Sandalwood Smugglers: ఎర్రచందనం కూలీలను పోలీసుల కళ్లుగప్పి డ్రైవర్, కండక్టర్ ఎలా తప్పించారంటే ! 


Also Read: Teacher Crime: సోషల్ టీచర్ పాడు పని, ఉపాధ్యాయిని నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు, మరో కిలాడీ పని!