ఈబీసీ నేస్తం నిధుల విడుదల కోసం ఈరోజు సీఎం జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అవమానం జరిగినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ఆయన్ను ఆహ్వానించే క్రమంలో బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు వచ్చే నేతల జాబితాలో బాలినేని పేరు లేకపోవడంతో ఆయన్ను లోనికి అనుమతించలేదు పోలీసులు. దీంతో ఆయన అలిగారు. వెంటనే కారు వెనక్కు తిప్పించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఈబీసీ నేస్తం సభ ప్రారంభమైనా బాలినేని సభా ప్రాంగణంలోకి రాలేదని తెలుస్తోంది. స్టేజ్ పై కూడా బాలినేని లేకుండానే కార్యక్రమం మొదలైంది. ఈ విషయంలో వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ లేదు. అటు బాలినేని కూడా మీడియా ముందు అసహనం వ్యక్తం చేయకుండా సైలెంట్ గా తిరిగి వెళ్లిపోయారు. జిల్లా నేతలతోపాటు మంత్రులు.. సీఎం జగన్ తో కలసి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. 


సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఏ జిల్లాకు వెళ్లినా అక్కడ ఆయన స్థానిక నాయకులతో కలసి పాల్గొంటారు. అసంతృప్తులు ఉంటే కార్యక్రమానికి దూరంగా ఉంటారు. నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత ఇప్పటి వరకూ జగన్ కార్యక్రమాల విషయంలో ఎక్కడా ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం హైలెట్ కాలేదు.


ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన ఈబీసీ నేస్తం నిధుల విడుదలకోసం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ దశలో జిల్లాలో కీలక నేత, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం కలకలం రేపుతోంది. హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటన వల్ల బాలినేని అలిగారని అంటున్నారు. హెలిప్యాడ్ వద్దకు ఆయన్ని రానివ్వకపోవడంతో అవమానంగా భావించి, సభలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 


ఈబీసీ నేస్తం కార్యక్రమం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ.. ఇతర ఓసీ కులాలలోని పేద మహిళలకు సీఎం జగన్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయా వర్గాల ప్రతినిధులను కూడా సీఎం జగన్ ఆహ్వానించారు. జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో జిల్లాలోని మరో కీలక నేత బాలినేని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈబీసీ నేస్తం లబ్ధిదారులు ఉన్న సామాజిక వర్గం నేతలందరూ జగన్ తో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందించారు. అయినా కూడా బాలినేని ఈ సభా వేదికపై కనిపించలేదు. 


వేదికపై కంప్యూటర్ బటన్ నొక్కి.. ఈబీసీ వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేస్తారు జగన్. ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఓసీ వర్గాల పేద మహిళలకు ప్రతి ఏటా 15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది కూడా నిధులు విడుదల చేస్తున్నారు జగన్.




విభేదాలున్నాయా..?
గతంలో మంత్రి పదవి కోల్పోయిన సందర్భంలో బాలినేని అలిగారు. అదే సమయంలో అదే జిల్లానుంచి ఆదిమూలపు సురేష్ ని మంత్రి వర్గంలో కొనసాగించడంపై కూడా ఆయన గుర్రుగా ఉన్నారు. ఈరోజు కార్యక్రమంలో హవా అంతా మంత్రి ఆదిమూలపు సురేష్ దే. అందుకే బాలినేని దూరంగా ఉన్నారా..? లేక కేవలం హెలిప్యాడ్ దగ్గర జరిగిన విషయంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై బాలినేని నుంచి కానీ, వైసీపీ వర్గాలనుంచి కానీ ఎలాంటి వివరణ రాలేదు.