నెల్లూరు జిల్లా కావలిలో విశ్వోదయ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామానికి చెందిన కంచర్ల రాజేంద్ర కావలిలోని విట్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండ్రోజులుగా అతను కాలేజీకి రావట్లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో హైవే పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పశువుల కాపర్లు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టి అతను ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ రాజేంద్ర గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 


అన్నీ అనుమానాలే..
గురువారం ఉదయం రాజేంద్ర కాలేజీకి వచ్చాడని, ఆ రోజు మధ్యాహ్నన్నం నుంచి అతను కనిపించడంలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కూడా రెండ్రోజులుగా తమ కొడుకు ఇంటికి రావడంలేదని చెబుతున్నారు. అయితే గత 10రోజులుగా రాజేంద్ర తమ సొంత ఊరు తురకపల్లికి వెళ్లడంలేదు. బుచ్చిరెడ్డిపాలెంలోని తన సోదరి ఇంటినుంచే కాలేజీకి వెళ్తున్నాడు. రెండ్రోజులుగా అటు తల్లిదండ్రుల వద్దకు, ఇటు సోదరి వద్దకు కూడా వెళ్లకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కావలి వద్ద తుమ్మలపెంటకు వెళ్లే హైవే పక్కన ముళ్లపొదల్లో శవమై తేలాడు. కాలేజీకి వెళ్లి ఉంటాడని, లేదా స్నేహితుల రూమ్ లో ఉంటాడని అనుకున్న కొడుకు ఇలా శవమై కనిపించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. 


హత్యా..? ఆత్మహత్యా..?
పశువుల కాపరులు ఇచ్చిన సమాచారంలో మొబైల్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది తొలుత ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత కావలి రూరల్ సీఐ ఖాజావలి, ఎస్సై వెంకట్రావుతో కలసి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. విద్యార్థి మృతి చెందిన ప్రదేశంలో సగం కాలిపోయిన సెల్‌ ఫోన్‌ ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.  విద్యార్థి మృతి ఘటనపై సమగ్రంగా విచారణ చేస్తామని డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. మృతదేహంపై దుస్తులు, శరీరం కాలి ఉన్నాయన్నారు. దీంతో అనుమానాస్పదంగా ఉందన్నారు. ఎవరైనా హత్య చేశారా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 


ఫోన్ సమాచారం కీలకం.. 
మృతిడి జేబులో సగం కాలిన సెల్ ఫోన్ ఉండటంతో.. దానిలోని డేటా ఆధారంగా అసలు విషయం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు రాజేంద్ర సహ విద్యార్థులను కూడా ఎంక్వయిరీ చేస్తున్నారు. 10రోజులుగా సొంతింటికి ఎందుకు వెళ్లడంలేదు, సోదరి ఇంటినుంచి ఎందుకు కాలేజీకి వస్తున్నాడనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. మొత్తమ్మీద కావలి పట్టణంలో బీటెక్ స్టూడెంట్ ఇలా అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. జిల్లా వ్యాప్తంగా ఈ దుర్ఘటన సంచలనంగా మారింది. త్వరలోనే అన్ని వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు పోలీసులు. 


Read Also: విమాన ప్రయాణంలో వీటిని తింటే సమస్యలు తప్పవు


Read Also: పోషకాల మునగాకు పరాటా... చపాతీకు బదులు ఇది తింటే ఎంతో మేలు


Read Also: టమోటా లేని లోటును ఇవి తీర్చేస్తాయ్... వండి చూడండి


Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Also Read: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి