తెలుగుకి ప్రాచీన హోదా దక్కిన అనంతరం తెలుగు భాషకు కూడా ఓ ప్రత్యేక విభాగం ఉండాలనే తలంపుతో ఏర్పడినదే ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం. మైసూర్ లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మొట్టమొదటిగా ఏర్పాటైన ఈ విభాగం అనంతరం తెలుగు రాష్ట్రాలకు తరలి వచ్చింది. ఏపీలో అందులోనూ నెల్లూరులో దీన్ని కేంద్రంగా చేసుకుని ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ విశిష్ట అధ్యయన కేంద్రంలో ఏం చేస్తారు..? తెలుగు భాషకు ఈ అధ్యయ కేంద్రం వల్ల కలిగే ఉపయోగం ఏంటి..? 


తెలుగు అనేది ఒక భాష మాత్రమే కాదు, ఒక జాతి వారసత్వ సంపద. ఇంగ్లిష్ మీడియంల మోజులో తెలుగు భాష ప్రమాదంలో పడినట్టేననే అనుమానాలు ఉండనే ఉన్నాయి. అయితే తెలుగు భాషకోసం, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటడంకోసం, తెలుగు భాషలో అరుదైన సాహిదీ సంపదను డిజిటలైజేషన్ చేసి ముందు తరాలకు అందించడం కోసం ఏర్పడిన కేంద్రం నెల్లూరులో ఉంది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం పేరుతో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్ లోని దీన దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ భవనంలో ఈ కేంద్రం నడుస్తోంది. 2018 నవంబర్ లో మైసూర్ లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అంతర్భాగంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పడింది. ఆ తర్వాత 2019లో దీన్ని నెల్లూరుకి తరలించారు. నెల్లూరులోనే శాశ్వత భవనం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న లైబ్రరీలో దాతలు ఇచ్చిన పుస్తకాలు, ఇతరత్రా పురాతన సాహితీ సంపద ఉంది. 




ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఇప్పటి వరకు 14 ప్రాజెక్ట్ లు పూర్తి చేసింది. వీటిలో తెలుగు శాశనాలు అనే పుస్తకాన్ని ముద్రణ రూపంలో తీసుకొచ్చింది. మిగతావి ముద్రణ కావాల్సి ఉన్నాయి. తెలుగు సాహితీ వేత్తలతో కొన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తారు, మిగతావి ఉద్యోగులతో చేయిస్తుంటారు. తెలుగు పుస్తకాలను పూర్తిగా డిజిటలైజేషన్ చేయి, ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో నూతన విద్యా విధానంలో పుస్తకాల రూపకల్పనకు కూడా ఈ విశిష్ట అధ్యయ కేంద్రం ఉపయోగపడుతోంది. తెలుగు లిపిని, భాషను అర్థం చేసుకోడానికి, అధ్యయనం చేయడానికి అవసరమైన శిక్షణ తరగతులు, సర్టిఫికెట్ కోర్సులను కూడా ఈ కేంద్రం అందిస్తోంది. 


ప్రస్తుతం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మునిరత్నం నాయుడు వ్యవహరిస్తున్నారు. స్వతహాగా తెలుగు భాషాభిమాని అయిన ఆయన.. ఈ విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 14 ప్రాజెక్ట్ లు పూర్తి చేశారు. ఈ అధ్యయన కేంద్రానికి స్వయం ప్రతిపత్తి కలిగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణ భారత్ ట్రస్ట్ కి చెందిన భవనంలో ఈ ప్రాజెక్ట్ కేంద్రం ఉంది. దీన్ని త్వరలో కొత్త భవనంలోకి మార్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసం స్థల సేకరణ కూడా పూర్తయింది. 




ఇక తెలుగు అధ్యయన కేంద్రం సేకరించిన పుస్తకాలతోపాటు.. దాతల నుంచి కూడా ఎంతో ఓపికగా పుస్తకాలు సేకరిస్తున్నారు. తెలుగు వారసత్వ సంపదను భావి తరాలకు అందించేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దాతలు ఇచ్చిన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలను జాగ్రత్తగా అధ్యయన కేంద్రంలో పదిలపరుస్తున్నారు. త్వరలో ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ సహకారంతో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్ మునిరత్నం నాయుడు. తెలుగు శాసనాలను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు వీలుగా ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తామంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన ఏకైక తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు జిల్లాలో ఉండటం, జిల్లాకు గర్వకారణం అంటున్నారు భాషాభిమానులు.